Azharuddin : ఆజారుద్దీన్ కోసం కవిత రాజీనామా..?
కవిత ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం, ఎట్టకేలకు అది ఆమోదం పొందడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ స్థానంపై పడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఆ స్థానం నుంచి ఎవరు బరిలోకి దిగుతారు, ఎవరు గెలుస్తారనే దానిపై తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే అనూహ్యంగా ఆ స్థానం నుంచి ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ అజారుద్దీన్ బరిలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానంలో, మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌ను బరిలోకి దింపే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అజారుద్దీన్ తన మంత్రి పదవిని కాపాడుకోవాలంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఏదో ఒక సభకు ఎన్నికవ్వాల్సి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గత ఏడాది అక్టోబరు 31న రాష్ట్ర మంత్రివర్గంలోకి అజారుద్దీన్ చేరారు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, చట్టసభ సభ్యుడు కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఆరు నెలల లోపు అంటే ఏప్రిల్ 30 నాటికి అసెంబ్లీ లేదా కౌన్సిల్‌కు ఎన్నికవ్వాలి. వాస్తవానికి ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపాలని ప్రభుత్వం భావించింది. అయితే, గవర్నర్ కోటా నియామకాలపై గతంలో ఉన్న వివాదాలు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల కారణంగా రాజ్‌భవన్ నుంచి ఆమోదం లభించలేదు. దీంతో కాలయాపన చేయకుండా, ఎన్నిక ద్వారానే ఆయనను చట్టసభకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కవిత రాజీనామాతో ఏర్పడిన ఖాళీ అజారుద్దీన్‌కు వరంగా మారే అవకాశం ఉంది. గాంధీభవన్‌లో జరిగిన తాజా చర్చల ప్రకారం.. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచే ఆయనను పోటీ చేయించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసినప్పటికీ, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో ఓటర్ల జాబితా సిద్ధం చేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని, తద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అజారుద్దీన్ విజయం సులభమవుతుందని పార్టీ విశ్లేషిస్తోంది. ఏప్రిల్ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలంటే, మున్సిపల్ ఎన్నికల ముగిసిన వెంటనే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలం పెంచుకునేందుకు ఈ ఎన్నిక ఒక వేదికగా మారనుంది. అయితే, ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉండటం, బీజేపీ ఎంపీ అరవింద్ వంటి నేతల ప్రభావం ఉండటంతో ఈ పోరు ఆసక్తికరంగా మారనుంది. అజారుద్దీన్ వంటి జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నేత బరిలో ఉంటే, ఇతర పార్టీలు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యమైనా, కేవలం మున్సిపల్ ఓటర్లతోనే ఈ ఉప ఎన్నికను నిర్వహించే వెసులుబాటుపై ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటోంది.
మంత్రి అజారుద్దీన్‌కు ఇది పరీక్షా కాలమే అని చెప్పాలి. అటు గవర్నర్ కోటాపై సందిగ్ధత, ఇటు రాజ్యాంగ గడువు సమీపిస్తుండటంతో నిజామాబాద్ ఎమ్మెల్సీ సీటే ఆయనకు ఇప్పుడు ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరిగితే, మంత్రి పదవికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే నిజామాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేలా కాంగ్రెస్ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పని చేస్తోంది.






