క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభం

హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర నగరాలు ఈర్ష్య పడుతున్నాయని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) జాతీయ వైస్ చైర్మన్ సి.శేఖర్‌రెడ్డి అన్నారు. ఎత్తైన భవనాల నిర్మాణాంలో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కొనసాగిస్తున్నాయని, హైదరాబాద్ బ్రాండ్‌ను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ( క్రెడాయ్) హైదరాబాద్ ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అభివృద్ధిని చూసి గ్లోబల్ బ్రాండ్లు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే మొదలైందని, భవిష్యత్తులో మరింత చూడబోతున్నామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని, ఇది సాకారమైంతే హైదరాబాద్ స్వరూపం మారిపోతుందని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ప్రాంతాలకు అదనంగా ప్రభుత్వం నెట్ జీరో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు. స్కిల్ యూనివర్సిటీతో నైపుణ్యం గల యువత తయారవుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. భవన నిర్మాణ అనుమతులు, ఎన్వోసీ జారీ ప్రక్రియ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ జి. రామ్ రెడ్డి, క్రెడాయ్ నేషనల్ ఇసి మెంబర్ సిహెచ్ రామచంద్రారెడ్డి, వి.రాజశేఖర్ రెడ్డి, క్రెడాయి అధ్యక్షుడు ఎలెక్ట్ ఎన్.జైదీప్ రెడ్డి, కార్యదర్శి బి.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.