బీఆర్ఎస్ తో బంతాట ఆడేస్తున్నారే…?

దశాబ్దకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం .. అత్యంత బలహీనంగా మారిపోయింది. ఆపార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీకి సంబంధం లేకుండానే… ఆ పార్టీలో విలీనమవుతుంది, ఈపార్టీలో విలీనం ఖాయమంటూ పుంఖానుపుంఖాలుగా వార్తలొస్తున్నాయి.దీన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఆగడం లేదు కాదు.. నిత్యం వార్తల్లో హైలెట్ అయ్యేలా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక బీఆర్ఎస్ నేతలు సతమతమవుతున్నారు.
రేవంత్ రెడ్డి ర్యాగింగ్…
బీజేపీతో డీల్ సెట్ అయ్యేలా ఉంది. ఆపార్టీ బీజేపీలో విలీనమవుతుంది. బిడ్డ కవితను విడిపించుకునేందుకు.. బీఆర్ఎస్ చీఫ్ ఈప్రతిపాదనతో ముందుకెళ్తున్నారన్నట్లుగా రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతే కాదు… ఎవరికి ఏపదవి వస్తుందో కూడా చెప్పేస్తున్నారు. దీంతో నిజమేనా..? అన్న అనుమానాలు ఆపార్టీ శ్రేణుల్లో సైతం వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవాలని కేటీఆర్ అండ్ కో ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.
కాంగ్రెస్ లోనే కలుస్తారంటున్న బండి..
మరోవైపు..బీజేపీ కూడా అబ్బే అలాంటి ప్రతిపాదన ఏమీ లేదు. ఆపార్టీని విలీనం చేసుకుంటే.. మాకేం లాభం అంటోంది. ఒకవేళ్ల మాసార్.. ఈపార్టీని నడపలేకపోతున్నాడు..కాబట్టి బీజేపీలో కలిస్తే బాగుండునని.. బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారేమోనని ఈటల లాంటి నేతలు కామెంట్స్ చేశారు. ఇక కేంద్రమంత్రి అయిన బండి సంజయ్ అయితే.. రివర్స్ కామెంట్ చేశారు.కాంగ్రెస్ పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనం అవుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి ఇది త్వరలో నెరవేరుతుందన్నారు బండి.
నిజానికి పైవ్యాఖ్యలు కింది స్థాయి నాయకులు చేస్తే పెద్దగా విలువ ఉండేది కాదు. వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తు బండి సంజయ్, రేవంత్ రెడ్డి కాబట్టి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. అయితే వారు చేసినట్టుగా భారత రాష్ట్ర సమితి విలీనం సాధ్యమవుతుందా.. అది అంత సులభమా.. అలా చేస్తే భారత రాష్ట్ర సమితికి ఎలాంటి లాభం చేకూరుతుంది.. అనేవి డిబేటబుల్ ప్రశ్నలు.
భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని అంటున్న మాటలు ఇవాల్టివి కావు. గతంలో 2004 లో కాంగ్రెస్ పార్టీతో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పొత్తు పెట్టుకుంది. అప్పట్లో హరీష్ రావు మంత్రి అయ్యారు. కెసిఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి బయటికి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం అవుతుందని వార్తలు వినిపించాయి. అయితే అవి వాస్తవరూపం దాల్చలేదు.
భారత రాష్ట్ర సమితికి గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో 0 స్థానాలు వచ్చాయి. ఇక ఆ పార్టీ కి భాస్ గా కెసిఆర్ ఉన్నారు. మనదేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలలో భారత రాష్ట్ర సమితి కూడా ఒకటి. వ్యూహాత్మక పొత్తులు.. ఎన్నికల్లో సహకారం వంటి అంశాల ఆధారంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలకు మద్దతు పలికాయి. ఇప్పటికీ ఆ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి రాజకీయాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత రాష్ట్ర సమితి విలీనం అనేది దాదాపు అసాధ్యమని.. మీడియాలో ఎప్పటికీ ఫోకస్ మోడ్ లో ఉండాలి కాబట్టి రాజకీయ నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జేడీయూ, డీఎంకే, అన్నా డీఎంకే, ఆర్జేడీ వంటి పార్టీలు జాతీయ పార్టీలలో విలీనం అవుతాయని గతంలో వార్తలు వచ్చాయి.. వాస్తవానికి అవేవీ కార్యరూపం దాల్చలేదు.