Congress: పదేళ్ళ పర్యావరణ విధ్వంసం లెక్కలు లాగిన కాంగ్రెస్

హెచ్ సి యూ(HCU) భూముల విషయంలో తమను విమర్శించే ముందు బీఆర్ఎస్(BRS) చేసిన పాపాల చరిత్ర తవ్వుకోవాలంటూ కాంగ్రెస్ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. దాదాపు వారం పది రోజుల నుంచి జరుగుతోన్న ఈ వ్యవహారంలో కాంగ్రెస్(Congress) లెక్కలు బయటకు తీసి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. 2014 మరియు 2023 మధ్య లక్షలాది చెట్లను నరికితే బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా ఏం చేస్తోంది అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇక కాంగ్రెస్ సోషల్ మీడియా దీనికి సంబంధించిన పలు లెక్కలు బయటకు లాగింది.
10,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసిన హరిత హారం కార్యక్రమం కారణంగా తెలంగాణాలో అటవీ భూములు పెరగలేదని కాంగ్రెస్ లెక్కలు చెప్తోంది. 2015 నుండి 2022 వరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. కెసిఆర్ స్వయంగా చేసిన ప్రకటన ప్రకారం 219 కోట్ల మొక్కలు నాటగా.. 9,777 కోట్లు ఖర్చు అయింది. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు ఖర్చు చేయగా.. అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు ఖర్చు చేసారు. కెసిఆర్ స్వయంగా చెప్పిన లెక్కల ప్రకారం నాటిన మొక్కలు 85% బతికాయి.
అలాంటప్పుడు తెలంగాణాలో అటవీ విస్తీర్ణం పెరగాల్సింది పోయి ఏ విధంగా తగ్గుతుందని కాంగ్రెస్ నిలదీస్తోంది. తెలంగాణ అటవీ విస్తీర్ణం 2014 నాటికి 21,591 చ.కి.మీ కాగా 2021 నాటికి 21,213 చ.కి.మీలుగా ఉంది. మరి ఎందుకు తగ్గిందని ప్రశ్నిస్తోంది. ఇక 2014 నుంచి 2024 వరకు 11,422.47 హెక్టార్ల అటవీ భూమి అధికారికంగా, అప్పటి సర్కార్ అటవీయేతర ప్రయోజనాల కోసం వినియోగించింది. అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి 2016 నుంచి 2019 మధ్య కాలంలోనే 12,12,753 చెట్లను కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నరికారు అంటోంది కాంగ్రెస్.
ఇందుకోసం 8,000 ఎకరాల్లో అడవిని నరికారు. చివరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా పోయినా దానిపై ఒక్కటంటే ఒక్క నిరసన కార్యక్రమం కూడా బీఆర్ఎస్ నేతలు గాని కార్యకర్తలు గాని చేయలేదని మండిపడుతోంది. 2014 నుంచి 2023 మధ్య కాలంలో 4,28,437 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం విక్రయించి 31,000 కోట్ల రూపాయలను అర్జించింది. మరి అప్పుడు లేని పర్యావరణ ప్రేమ ఇప్పుడు ఎందుకని మండిపడుతోంది.