What Next? : సీబీఐకి కాళేశ్వరం కేసు..! వాట్ నెక్స్ట్..!?
తెలంగాణలో (Telangana) రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులో అవకతవకలపై విచారణను సీబీఐకి (CBI) అప్పగిస్తూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జి పి.సి.ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) ఏర్పాటు చేసి దీనిపై సమగ్ర అధ్యయనం చేయించిన తర్వాత ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చించింది. చివరకు దీనిపై విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో తదుపరి ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కోరగానే సీబీఐ విచారణ చేపడుతుందా..? కేసును సీబీఐ టేకప్ చేయాలంటే నిబంధనలేంటి..? అనే అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకూ అనేక అవకతవకలు జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక వెల్లడించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితే కక్ష సాధించామనే ఆరోపణలు వస్తాయి కాబట్టి దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ మేరకు సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు (Home Ministry) లేఖ రాశారు. అంతేకాక ఈ ప్రాజెక్ట్‌లో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (వాప్కాస్), ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ (PFC, REC) పాల్గొన్నాయని, అంతర రాష్ట్ర అంశాలు ఉన్నందున సీబీఐ విచారణ అవసరమని పేర్కొన్నారు.
మరోవైపు.. డిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (DSPE) యాక్ట్, 1946 సెక్షన్ 6 కింద, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ కూడా ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జీవో 51 ద్వారా ఈ కన్సెంట్ను ఉపసంహరించింది. ఇప్పుడు ప్రత్యేక కన్సెంట్‌తో నోటిఫికేషన్ జారీ చేసి కేంద్రానికి పంపారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతి లభించింది.
DSPE యాక్ట్, 1946 ప్రకారం సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ కన్సెంట్ తప్పనిసరి. సెక్షన్ 6 కింద రాష్ట్రం కన్సెంట్ ఇస్తే, సెక్షన్ 5 కింద కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి లేఖ వెళ్లిన తర్వాత, కేంద్ర హోంశాఖ సెక్షన్ 5 కింద అనుమతి ఇవ్వాలి. అప్పుడే సీబీఐ విచారణ మొదలవుతుంది. కేంద్రం అనుమతి లేకుండా సీబీఐ చర్య తీసుకోదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకసారి కన్సెంట్ ఇచ్చిన తర్వాత రద్దు చేయకూడదు.
సీబీఐ దర్యాప్తు కోరినప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదు చేయాలి. కాళేశ్వరంపై మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్లో 2020 అక్టోబర్ 21న ఇంజనీరింగ్ అధికారి ఫిర్యాదుపై ఇప్పటికే కేసు నమోదైంది. దీని ఆధారంగా విచారణ సాగవచ్చు. అవసరమైతే కొత్త కేసు కూడా నమోదు చేయవచ్చు. సీబీఐ కేసు టేకప్ చేస్తే ఆర్థిక అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా విచారణ చేపట్టవచ్చు. ఇప్పటికే ఏసీబీ (ACB) దాడుల్లో కాళేశ్వరం ఇంజనీర్లు హరి రామ్, మురళిధర్ రావు, ఎన్. శ్రీధర్ వద్ద రూ. 200 కోట్లకు పైగా ఆస్తులు పట్టుబడ్డాయి. ఇవి సీబీఐ, ఈడీ విచారణకు దోహదపడతాయి.
సెక్షన్ 6 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కన్సంట్ ఇచ్చేసింది కాబట్టి కేంద్రం సెక్షన్ 5 కింద అనుమతి ఇస్తే సీబీఐ విచారణ త్వరగా మొదలవుతుంది. అయితే కేంద్రం వెంటనే సెక్షన్ 5 కింద అనుమతి ఇస్తుందా.. లేకుంటే నాన్చుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. దీనిపై సీబీఐ విచారణకు కేంద్రం సముఖంగా లేకపోతే దీన్ని అలాగే నాన్చి పెట్టొచ్చు. అప్పుడు ఇది ముందుకు సాగదు. విచారణ చేపట్టేందుకు రెడీగా ఉంటే కేంద్ర హోంశాఖ వెంటనే సెక్షన్ 5 కింద అనుమతి మంజూరు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుండడంతో అనుమతి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగానే భావించవచ్చు.







