Kavitha – KTR: కవితకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!
భారత రాష్ట్ర సమితి (BRS)లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గౌరవాధ్యక్ష పదవి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను (Kavitha) తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను (Koppula Eswar) నియమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కవిత అమెరికాలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (KTR) ఆదేశాలతో ఈ మార్పు జరగడం వివాదాస్పదంగా మారింది. తనను తొలగించడంపై కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సింగరేణి కార్మికులకు లేఖ రాశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారం కేసీఆర్ కుటుంబంలోనూ, బీఆర్ఎస్లోనూ ఉన్న ఆధిపత్య పోరును మరోసారి బహిర్గతం చేసింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికుల్లో టీబీజీకేఎస్ కు మంచి పట్టుంది. ఇది బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఈ సంఘానికి 2015 ఆగస్టు 17న కొత్తగూడెంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కవిత గౌరవాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో కార్మికుల సంక్షేమం కోసం పలు కీలక చర్యలు చేపట్టినట్లు కవిత తన లేఖలో పేర్కొన్నారు. దాదాపు 19,463 మంది యువతకు ఉద్యోగాలు కల్పించేలా కేసీఆర్‌ను ఒప్పించడం, కార్మికుల క్వార్టర్స్‌కు ఉచిత విద్యుత్, ఐఐటీ, ఐఐఎం సీట్లు సాధించిన కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తాను కీలకంగా వ్యవహరించినట్లు ఆమె చెప్పారు.
సింగరేణి కార్మికులకు రాసిన బహిరంగ లేఖలో కవిత తన తొలగింపును రాజకీయ కక్షగా అభివర్ణించారు. తాను కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న సమయంలో, తనను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కార్మికులతో తన బంధం ఎప్పటికీ గట్టిగా ఉంటుందని, గౌరవాధ్యక్షురాలిగా కొనసాగకపోయినా వారి కోసం పని చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఎన్నిక చట్టవిరుద్ధమని, సింగరేణి కార్మికుల ఐక్యతను బలహీనం చేసే కుట్రలో భాగమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కవిత ప్రస్తుతం అమెరికాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో కొప్పుల ఈశ్వర్‌ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత తొలగింపు వెనుక కేటీఆర్, కవిత మధ్య ఆధిపత్య పోరు ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తోబుట్టువుల మధ్య రాజకీయ విభేదాలు తీవ్రమవుతున్నాయి. మే నెలలో కవిత, కేసీఆర్ కు రాసిన ఒక లేఖ లీక్ అయిన తర్వాత ఈ విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. ఆ లేఖలో పార్టీలోని కొన్ని అంశాలపై కవిత ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత, పార్టీలో కొందరు “దయ్యాలు” తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని, కేసీఆర్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కేటీఆర్‌పై పరోక్షంగా దాడిగా భావించారు.
ఈ వ్యవహారం బీఆర్ఎస్లోని అంతర్గత సంక్షోభాన్ని మరింత స్పష్టం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల్లో చేరడం, టీబీజీకేఎస్ వంటి అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ నుంచి దూరం కావడం వంటి సంఘటనలు పార్టీని బలహీనపరిచాయి. కవిత తొలగింపు, కొప్పుల ఈశ్వర్ నియామకం ఈ సంక్షోభానికి మరో ఉదాహరణగా నిలిచింది. అయితే కవితను తొలగించడం ద్వారా పార్టీపైన కేటీఆర్ మరింత పట్టును సాధించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కవిత తొలగింపు కేవలం టీబీజీకేఎస్‌కు సంబంధించిన మార్పుగానే చూడకూడదు. బీఆర్ఎస్లో ఆమె ప్రభావాన్ని తగ్గించే కేటీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. కవిత ఇప్పటికే ఈ విషయాన్ని గ్రహించి తెలంగాణ జాగృతి ద్వారా తన సొంత రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. మొత్తంగా, ఈ వ్యవహారం బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత మధ్య ఆధిపత్య పోరును మరింత స్పష్టం చేసింది. కేసీఆర్ కుటుంబంలోని ఈ విభేదాలు, పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.







