నాడు తొడలు కొట్టి నేడు కాళ్లబేరం..! రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి డీల్..!?

పూలమ్మినా.. పాలమ్మినా.. డైలాగ్ తో సూపర్ పాపులర్ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్లారెడ్డికి సోషల్ మీడియాలో మంచి పాలోయింగ్ ఉంది. మల్లారెడ్డి ఎక్కడున్నా, ఏం మాట్లాడినా దాన్ని చూడాలని వినాలని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. అయితే బీఆర్ఎస్ ఇప్పుడు ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్ తో కాళ్లబేరానికి వెళ్లారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు మల్లారెడ్డి. ఆ సమయంలో ఆయన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. పాలు, పూలు అమ్మి తెలంగాణలోనే పేరొందిన మల్లారెడ్డి విద్యాసంస్థలను స్థాపించారాయన. డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన ఆ విద్యాసంస్థల్లో ఇప్పుడు వేలాది మంది చదువుకుంటున్నారు.
గత ప్రభుత్వం హయాంలో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. కాలేజికి డీమ్డ్ హోదా లభించింది. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న కాలేజీ భవనాలకు అనుమతులొచ్చాయి. మరికొన్నింటిని ఆక్రమించి కట్టేసుకున్నారు. అయితే ఇంతలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతో సమస్యలు చుట్టుముడుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. రేయ్ రేవంత్.. రారా చూసుకుందాం.. అని తొడకొట్టి మరీ సవాల్ విసిరారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యారు. నిజంగానే మల్లారెడ్డి కోరినట్లు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి విద్యాసంస్థలపై బుల్డోజర్స్ పంపించారు. అక్రమంగా చెరువు శిఖం భూములను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చేశారు. దీంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి హుటాహుటిన రేవంత్ తో బేరసారాలు నడిపారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో సలహాదారు వేంనరేందర్ రెడ్డిని కలిసి సెటిల్ చేయమని కోరారు.
మరోవైపు ఇన్నాళ్లూ మల్కాజిగిరి పార్లమెంటు స్థానం తమకే ఇవ్వాలని మల్లారెడ్డి పట్టుబడుతూ వచ్చారు. అక్కడి నుంచి కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దింపాలనేది ఆయన కోరిక. మేడ్చల్ నుంచి తాను, మల్కాజిగిరి నుంచి అల్లుడు ఎమ్మెల్యేగా గెలవడంతో ఎంపీ సీటు కూడా ఈజీగా గెలుస్తామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ సీటు మాకొద్దు బాబోయ్ అని చేతులెత్తేశారు. శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి తాము పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు.
అయితే పార్టీ మారే ఉద్దేశం లేదని మాటిచ్చారు. రేవంత్ రెడ్డికి భయపడే మల్లారెడ్డి ఫ్యామిలీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతేకాదు.. కేసుల నుంచి బయటపడేందుకు, అక్రమాల వెలుగులోకి రాకుండా ఉండేందుకు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరేందుకు మల్లారెడ్డి ఫ్యామిలీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మల్లారెడ్డి రేవంత్ రెడ్డితో కాళ్లబేరానికి వెళ్లినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.