Phone tapping case : తెలంగాణలో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ రచ్చ..!!

తెలంగాణలో (Telangana) అత్యంత సంచలనం కలిగించిన అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ (phone tapping) ఒకటి. గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS).. పలువురి ఫోన్లను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై లోతుగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో పలు కీలక అంశాలు కూడా బయటికొచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఐపీఎస్ (IPS) అధికారులు, పోలీసులను ప్రభుత్వం గుర్తించింది. అయితే ఎవరు చెప్తే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో కొంతమంది ప్రముఖుల అరెస్టులు (arrest) ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సియోల్ (Seol) పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి లోపే పొలిటికల్ బాంబు (political bomb) బద్దలవుతుందన్నారు. దీంతో ఏమై ఉంటుందబ్బా అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao), శ్రవణ్ రావుల (Sravan Rao) పాస్ పోర్టులను (Passport) పాస్ పోర్టు అథారిటీ రద్దు చేసింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ అమెరికాలో (America) ఉంటున్నారు. ఇప్పుడు పాస్ పోర్టులు రద్దు కావడంతో వీళ్లిద్దరూ అమెరికా నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే వీళ్లద్దరిపైన లుకౌట్ (lookout) నోటీసులున్నాయి.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాడు పలువురు బాధితులుగా ఉన్నారు. రాజకీయ నేతలు, మీడియా ప్రముఖులు, సినీ ప్రముఖులు, లాయర్లు, జడ్జిలు, కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు ఫోన్లను కూడా గత ప్రభుత్వం ట్యాప్ చేసిందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే దీని విచారణ ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు అరెస్టులు జరగవచ్చని ప్రభుత్వం లీకులు ఇస్తోంది. అయితే ఎవరెవరిని అరెస్టు చేస్తారనేది మాత్రం క్లారిటీ రావట్లేదు. కేసీఆర్ లేదా కేటీఆర్ లలో ఒకరిని అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. రేవంత్ సర్కార్ కు అడుగడుగునా అడ్డు పడుతోంది బీఆర్ఎస్. అందుకే ఆ పార్టీకి ముకుతాడు వేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నట్టు సమాచారం.
అయితే ఏం పీక్కుంటారో పీక్కోనివ్వండి.. భయపడేదే లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులతో పాటు విపక్ష నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై లై డిటెక్టర్ (lie detector) పరీక్షకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. అయితే తన హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పైన కేటీఆర్ ముందు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించుకోవాలని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా త్వరలోనే ఈ కేసుకు సంబంధించి కొంతమంది కీలక వ్యక్తులను అరెస్టు చేయవచ్చనే ప్రచారం మాత్రం తెలంగాణలో జోరుగా సాగుతోంది.