Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె పార్టీ కార్యకలాపాలను గాంధీ భవన్‌కు (Gandhi Bhavan) పరిమితం చేయకుండా, తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariate) సమీక్షలు నిర్వహించడం వివాదాస్పదమైంది. ఈ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆమె వైఖరిని తప్పుబడుతూ హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలను (Dy. CM Mallu Bhatti Vikramarka) కాదని ఒక పార్టీ పరిశీలకురాలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేక సమస్యలకు దారితీస్తోంది.
మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సన్నిహితురాలిగా పేరొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గా నియమితులైన ఆమె, పార్టీలో క్రమశిక్షణ, సమన్వయం పెంచడానికి వచ్చినట్లు ప్రకటించారు. మిగిలిన ఇన్ ఛార్జ్ లలాగా కాకుండా ఆమె సాధారణ ప్రయాణికురాలిలా రైల్లో రావడం, పార్టీ కేడర్ ను ఆర్భాటాలకు దూరంగా ఉండాలని ఆదేశించడంతో పార్టీలో మార్పు కనిపిస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఆమె వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదంపై సచివాలయంలో మంత్రులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్‌లో జరగింది.. సచివాలయం ఒక రాజ్యాంగ వ్యవస్థ. అక్కడ పార్టీ సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల మధ్య సరిహద్దులు చెరిపేయడమే. ఇది విమర్శలకు దారితీస్తోంది.
భారత రాష్ట్ర సమితి (BRS), భారతీయ జనతా పార్టీ (BJP) దీనిపై తీవ్రంగా స్పందించాయి. ‘సచివాలయం గాంధీ భవన్‌లా మారింది’ అని BRS నేతలు విమర్శించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్‌గా మారారు. రాష్ట్ర వ్యవహారాలను ఢిల్లీ హైకమాండ్ నిర్వహిస్తోంది’ అని BJP నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఈ విమర్శలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కూడా మీనాక్షి వైఖరిని తప్పుబడుతున్నారు. కొందరు నాయకులు ఆమె సచివాలయంలో సమీక్షలు నిర్వహించడం ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యంగా భావిస్తూ హైకమాండ్‌కు ఫిర్యాదులు పంపినట్లు తెలుస్తోంది. ‘పార్టీ ఇన్‌ఛార్జ్ గాంధీ భవన్‌లో సమావేశాలు నిర్వహించాలి, సచివాలయంలో కాదు’ అని ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు. పార్టీలో అంతర్గత విభేదాలను ఇవి మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. మీనాక్షి చర్యలు సీఎం, డిప్యూటీ సీఎం అధికారాలను కాదనడమే కాకుండా, పార్టీ స్థానిక నాయకత్వాన్ని బలహీనపరుస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడం పార్టీకి పెద్ద విజయంగా నిలిచింది. దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న BRSను ఓడించి కొత్త ఆశలను రేకెత్తించింది. అయితే మీనాక్షి నటరాజన్ చర్యలు ఈ విజయంపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాయి. ఆమె సచివాలయంలో పాల్గొన్న సమావేశాలు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను గందరగోళంలోకి నెట్టాయి. ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బ తగలవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వివాదం పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. మరి హైకమాండ్ మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.