Kavitha: పార్టీకి, పదవికి కవిత గుడ్ బై..!? నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే..!!?

బీఆర్ఎస్ (BRS) పార్టీలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కుటుంబంలోని విభేదాలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై (Kavitha) అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం, పార్టీ కీలక నేతలపై ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది. దీంతో కవిత తదుపరి అడుగులు ఎటు వేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. పార్టీ నుంచి సస్పెండ్ (suspend) చేసిన తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కవిత నిర్ణయించుకున్నట్టు సమాచారం.
కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కావడం, జైలుకు వెళ్లడంతో ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టారు కేసీఆర్. తనను దూరంపెట్టడానికి కేటీఆరే కారణమని కవిత భావిస్తున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అదే సమయంలో తను కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం, వాటి వెనుక కొందరు దెయ్యాలున్నారని కవిత చెప్పడం సంచలనం కలిగించింది. తాజాగా కాళేశ్వరం అవినీతి మరక కేసీఆర్ కు అంటడానికి హరీశ్ రావు, సంతోశ్ రావే కారణమని కవిత బాంబ్ పేల్చారు. వీటిని పార్టీ సీరియస్ గా తీసుకుంది. వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
పార్టీ నుంచి కవితను బయటకు పంపడం ఖాయమనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పుడనేది అంచనాకు వేయలేకపోయారు. అయితే ఇప్పుడు పార్టీ వేటు వేయడంతో ఊహించిందే జరిగిందని చెప్పుకుంటున్నారు. పార్టీ తనను సస్పెండ్ చేయడంతో ఇక ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవడమే మేలనే ఆలోచనకు కవిత వచ్చినట్లు సమాచారం. అందుకే ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న తర్వాత కవిత సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుజనులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టబోతున్నారని ఆమె సన్నిహితులు చెప్తున్న మాట. ఇప్పటికే పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని, ఒకటి రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని సమాచారం. అయితే ఆమె పార్టీ ఎంతమేర ప్రభావం చూపిస్తుందనేది అంచనా వేయడం కష్టం. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆమె ఫోటోలను కార్యాలయాల్లో తొలగించారు. ఆమె దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కవిత పార్టీలోకి ఎవరైనా కీలక నేతలు వెళ్తే బీఆర్ఎస్ కు కాస్త ఇబ్బంది ఎదురుకావచ్చు. కానీ ఇప్పుడైతే అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పలేం. వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాగా చాలా ఎక్కువ ఊహించుకున్నారు. తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు కవిత పార్టీ పరిస్థితి కూడా ఇంతే అని చాలా మంది చెప్పుకుంటున్నారు. కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కొందరు, బీజేపీ ఉందని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాయని చెప్పొచ్చు.