Kavitha: బీఆర్ఎస్‌లో కవిత ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్?

బీఆర్ఎస్ (BRS) లో ఇటీవలి పరిణామాలు పార్టీలో అంతర్గత సంక్షోభం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలపై తీవ్ర చర్చకు దారితీశాయి. ఎమ్మెల్సీ కవిత (Kavitha) రాసిన లేఖ బయటకు రావడంతో పార్టీలో అసంతృప్తి బయటపడింది. ఈ నేపథ్యంలో, పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. దామోదర్ రావు, న్యాయవాది గండ్ర మోహన్ రావు కవిత ఇంటికి వెళ్లి సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపినట్లు సమాచారం. కవిత లేఖ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, పార్టీ భవిష్యత్తు వ్యూహంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు ఏసీబీ (ACB) నోటీసులు ఇవ్వడాన్ని కవిత ఖండించారు. దీంతో బీఆర్ఎస్‌లో అంతర్గత సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా పరిణామాలు సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి.
పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కు కవిత రాసిన బయటకు రావడంతో ఆ పార్టీలో పరిస్తితులు అంత సానుకూలంగా లేవనే విషయాన్ని బయటపెట్టింది. దీనిపై కవిత కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. కేసీఆర్ దేవుడని.. ఆయన చుట్టూ ఉన్న కొన్ని దెయ్యాలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. తనను రాజకీయంగా ఒంటరి చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పార్టీలో తన స్థానం, కేటీఆర్ నాయకత్వంపై పరోక్షంగా ఆమె ప్రశ్నలు లేవనెత్తినట్లు భావిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. పార్టీలో ఏదైనా ఇబ్బంది ఉంటే అంతర్గతంగా చర్చించవచ్చని, బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన సూచించారు.
ఈ వివాదం నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు డి. దామోదర్ రావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ గండ్ర మోహన్ రావు కవితతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కవిత లేఖలోని అంశాలు, పార్టీలో ఆమె స్థానం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం. దామోదర్ రావు, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. కవితను శాంతింపజేసి, పార్టీలో ఐక్యతను నెలకొల్పే ప్రయత్నం జరిగినట్లు భావిస్తున్నారు. కవిత రాజకీయ భవిష్యత్తు, ఆమె స్థానం గురించి కూడా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో, కేటీఆర్‌కు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 2023లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ ద్వారా 55 కోట్ల రూపాయలను అనధికారికంగా యూకేకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై కవిత స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసీఆర్ సైనికులు తట్టుకుని నిలబడతారు అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిని పార్టీ ఐక్యతకు సంకేతంగా చూస్తున్నారు.
కవిత లేఖ, ఏసీబీ నోటీసులు, కుటుంబ విభేదాలు బీఆర్ఎస్‌ను సంక్షోభంలోకి నెట్టినప్పటికీ, దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు సమావేశం ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు పడినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి, పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. అయితే.. కవిత స్థానం, ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.