Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) , ఆయన సోదరుడు రాము (Ramu)ను నకిలీ మద్యం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. రమేష్‌ను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వేకువజామున 4.20 గంటలకు సిట్, పోలీసు, ఎక్సైజ్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు ఇబ్రహీంపట్నం వెళ్లాయి. ఒక బృందం జోగి రమేష్ ఇంటికి వెళ్లింది. నకిలీ మద్యం కేసులో రమేష్‌ను అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంలో రమేష్ కుటుంబసభ్యులు, పోలీసుల (Police) మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. జోగి ఇంటిని తనిఖీ చేసేందుకు జారీ అయిన వారంట్ ఇచ్చి, దానిపై ఆయన సంతకం తీసుకున్నారు. అనంతరం 8 గంటలు దాటాక అదుపులోకి తీసుకుని విజయవాడ (Vijayawada) గురునానక్ కాలనీలోని తూర్పు ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.






