Jagan: సభలకు దూరంగా వైసీపీ… వర్షాకాల సెషన్‌కైన జగన్ వ్యూహం మారుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలకు ఎక్కువ రోజుల సమయం కేటాయించడం, వర్షాకాలం మరియు శీతాకాల సమావేశాలను కూడా నిరంతరంగా నిర్వహించడం ద్వారా శాసనసభ దినాలు గణనీయంగా పెరిగాయి. గతంలో విపక్షాలు ఏడాదిలో కనీసం 60 రోజుల పాటు అసెంబ్లీ జరగాలని డిమాండ్ చేసేవి. ఇప్పుడు ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు 30 రోజులు, మిగతా రెండుసార్లకు పది పది రోజులు కేటాయిస్తూ సభను నడిపిస్తుండటం సాధికార పాలనకు సంకేతంగా చెబుతున్నారు.
ప్రస్తుతం శాసనసభలో మొత్తం 175 మంది సభ్యులుండగా, అందులో 164 మంది సభ్యులు కూటమి ప్రభుత్వానికే చెందారు. కేవలం 11 మంది మాత్రమే వైసీపీ (YSRCP) తరఫున ఉన్నారు. ఈ కారణంగా సభలో చర్చలు ఒకే దిశగా కొనసాగుతున్నట్లు అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ (YCP) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) గత రెండు బడ్జెట్ సమావేశాలకు హాజరుకాలేదు. ఆయన గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగే సమావేశాలకు జగన్, అతని పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
ఇప్పటికే కూటమి హయాంలో రెండు బడ్జెట్ సెషన్లు, ఒక వర్షాకాల, ఒక శీతాకాల సమావేశాలు పూర్తయ్యాయి. అయితే వైసీపీ ఈ నాలుగు సమావేశాలకు దూరంగా ఉండడం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) ఈసారి రానున్న వర్షాకాల సమావేశాలు ఆగస్టులో నిర్వహిస్తామని ప్రకటించారు. అవి దాదాపు 10 రోజుల పాటు జరగనున్నాయి. ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత సమావేశాలు మొదలయ్యే అవకాశముంది.
ఇప్పుడు అందరి దృష్టి జగన్ ఈ సమావేశాలకు వస్తారా లేదా అన్న విషయం పై ఉంది. మొదటి ఏడాదిలో అసెంబ్లీకి దూరంగా ఉన్న ఆయన, ప్రస్తుతం జిల్లాల్లో పర్యటనలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మొదటి సంవత్సరంలో ఎదురైన ప్రజాదరణ తగ్గుతోందని ఆయన విశ్వసిస్తున్నారు అని టాక్ . అదే సమయంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పార్టీ వర్గాలు , జగన్ అభిమానులు భావిస్తున్నారు. ప్రజల్లో కూడా జగన్ ఈసారి అసెంబ్లీకి హాజరవ్వాలని అభిప్రాయం ఉంది. ఆయన తీరును బట్టి ఈ వర్షాకాల సెషన్ రాజకీయంగా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.