Bhogapuram: అటు వైసీపీ.. ఇటు టీడీపీ ..ఇంతకీ భోగాపురం క్రెడిట్ ఎవరిది?
భోగాపురం (Bhogapuram) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (International Airport) అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంపై టీడీపీ (TDP), వైసీపీ (YSRCP) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ఎక్కువగా ముందుకు వెళ్లిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అనుమతులు, కోర్టు వివాదాల పరిష్కారం, భూసేకరణ, శంకుస్థాపన అన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని వారు గుర్తు చేస్తున్నారు. దాదాపు 80 శాతం పనులు అప్పుడే పూర్తయ్యాయని వైసీపీ వాదన.
దీనికి టీడీపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఒకప్పుడు జగన్ విపక్ష నేతగా ఉన్న సమయంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ అవసరమా అని ప్రశ్నించిన వీడియోలను బయటకు తీసి, అదే మీ అభివృద్ధి దృష్టికోణమా అంటూ కౌంటర్లు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతున్నప్పటికీ, ప్రాజెక్ట్ మాత్రం కీలక దశకు చేరుకుంది.
ఇదిలా ఉండగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) చేసిన వ్యాఖ్యలు ప్రాజెక్ట్‌కు కొత్త ఉత్సాహం ఇచ్చాయి. ఢిల్లీ (Delhi) నుంచి వాణిజ్య విమానంలో నేరుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయి ట్రయల్ రన్ విజయవంతం కావడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా (Air India) సహకారంతో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం దిగడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) పేరు పెట్టడం కూడా విశేషమని పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి అనుమతులు 2016లోనే అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) తెచ్చారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 18 నెలలుగా నిరంతర సమీక్షలతో పనులను వేగవంతం చేశామని చెప్పారు. డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సిన పనులను ఆరు నెలలు ముందుగానే పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. ఎల్ అండ్ టీ (L&T), జీఎంఆర్ (GMR), డీజీసీఏ (DGCA) అధికారులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. భూములు ఇచ్చి సహకరించిన స్థానిక రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వరల్డ్ క్లాస్ ఏవియేషన్ హబ్‌గా మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు శంషాబాద్ (Shamshabad) ఎయిర్‌పోర్ట్‌పై వచ్చిన విమర్శలకు ఇదే సమాధానమని అన్నారు. విశాఖ (Visakhapatnam), విజయనగరం (Vizianagaram), శ్రీకాకుళం (Srikakulam) జిల్లాల భవిష్యత్ ఈ ఎయిర్‌పోర్ట్‌తో మారుతుందని చెప్పారు. టూరిజం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు.
ఇంకా నాలుగు నుంచి ఐదు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుందని తెలిపారు. ఒడిశా (Odisha), రాయపూర్ (Raipur) ప్రాంతాల ప్రజలకు కూడా ఇది ఉపయోగపడుతుందని, ఎయిర్ కనెక్టివిటీ మెరుగవుతుందని అన్నారు. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






