Yamini Sharma: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచే.. వైసీపీ విషప్రచారం : యామినీశర్మ

రాష్ట్రం అభివృద్ధి చెందినా, ప్రజలు సుఖంగా ఉన్నా వైఎస్ (YS Jagan) జగన్ తట్టుకోలేరని, అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరునాటి నుంచే విషప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ (Yamini Sharma) విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైద్య కళాశాలల నిర్మాణం విషయంలో జగన్, వైసీపీ నాయకులు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక ఇప్పుడు దొంగ ఏడుపులు ఎందుకుని ప్రశ్నించారు. మొండి గోడలు, ఖాళీ స్థలాలు చూడ్డానికా నర్సీపట్నం వెళ్లారు? రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల కోసం కేంద్రం ఇచ్చిన రూ.1,950 కోట్లను ఎందుకు ఖర్చు చేయలేకపోయారు. వైసీపీ (YCP) ప్రభుత్వం రూ.8,480 కోట్లు కేటాయించిందని చెబుతున్న జగన్, కళాశాలల భవనాలు ఎందుకు కట్టలేదు? కొన్నింటికి కనీసం భూ సేకరణ కూడా ఎందుకు చేపట్టలేదు అని ఆమె ప్రశ్నించారు. జగన్ పాలనలో కల్తీ మద్యంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారని, రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వాధినేతగా 24 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి యామినీశర్మ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ (Modi) పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు.