World Telugu Conference: తెలుగు భాషా వైభవాన్ని చాటిన మహాసభలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని గుంటూరు శివారులో శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో జనవరి 3 నుంచి 5 వరకు అత్యంత వైభవంగా జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5, 2026న ఘనంగా ముగిశాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాసభలకు ‘అనురాగ సంగమం’గా నామకరణం చేశారు. 52 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, దేశవ్యాప్తంగా తెలుగు సంఘాల సభ్యులు పాల్గొనడంతో ఈ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాషా వైభవాన్ని చాటింది. ముగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్యక్షడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మహా సభల్లో మారిషస్ దేశ అధ్యక్షడు ధరమ్ బీర్ గోకుల్, సతీ సమేతంగా పాల్గొన్నారు.
మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇంత పెద్ద తెలుగు సభ జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. మనిషికి పుట్టుకతోనే మాతృబంధం, భాషాబంధం ఏర్పడతాయి. భాష కేవలం భావవ్యక్తీకరణకు మాత్రమే కాదు. ఒక ప్రపంచాన్ని సృష్టించేంత బలం భాషలో ఉంది. మనందరం భాష వల్ల బంధువులం. తెలుగు భాష వల్ల మనకు ఓ గుర్తింపు ఉంది. అధికార వ్యవహారాల్లో తప్పనిసరిగా తెలుగు ఉండాలి. జిల్లాస్థాయి వరకు కోర్టు కార్యకలాపాలు తెలుగులో జరగాలి. ’’ అని ఆకాంక్షంచారు.
‘ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదవాలని జాతీయ విద్యా విధానం చెబుతోంది. నాకు తెలుగు బాగా వచ్చు కాబట్టే ఐదు భాషాలు నేర్చుకున్నా. ప్రపంచంలో వివిధ రంగాల ప్రముఖులు వారి మాతృభాషలో చదువుకున్నారు. ఇంగ్లీష్ వల్లే ఉద్యోగాలు రావు. విషయ పరిజ్ఞానం ఉంటే వస్తాయి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి పెట్టాలి’’ అని పూర్వ జేడీ లక్ష్మనారాయణ తెలిపారు.
ప్రపంచ మహా సభలకు తొలిసారిగా ఓ దేశాధ్యక్షడు హాజరయ్యారు. మారిషస్ దేశ అధ్యక్షడు ధరమ్ బీర్ గోకుల్, సతీ సమేతంగా తెలుగు మహా సభల్లో పాల్గొన్నారు. వేదిక వద్దకు వచ్చిన వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ధరమ్ బీర్ గోకుల్‌ను అశ్వరథంపై మహాసభల ప్రధాన వేదిక వద్దకు తీసుకెళ్లిన నిర్వాహకులు.. ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య , ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, పలువురు ప్రముఖులు స్వాగతం కార్యక్రమంలో పాల్గొని అనంతరం వారితో పాటు వేదిక పంచుకున్నారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి నమస్కరించిన మారిషస్ అధ్యక్షడు ధరమ్ బీర్ గోకుల్.. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకు ముందు సభ ప్రారంభం కాగానే.. నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆంధ్ర సాహిత్యం, చరిత్ర, ఆంధ్ర చారిత్రక వైభవం తెలియజేస్తూ ఆలపించిన గీతాలకు చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది.
చారిత్రాత్మక, విశిష్టమైన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు జిల్లాలో జరపడం అభినందనీయమని ధరమ్ బీర్ గోకుల్ తెలిపారు. ఈ మహాసభల్లో తనకు ప్రసంగించే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని ధరమ్ బీర్ గోకుల్ పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో ఉగాది పండుగను మారిషస్‌లో ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పుకొచ్చారు. మారిషస్‌లో జాతీయ సెలవు దినంగా ప్రకటించి ఉగాది పండుగను చేసుకుంటున్నామని వెల్లడిరచారు. భాష, సంస్కృతి కాపాడటం ప్రతి దేశం బాధ్యత మాత్రమే కాదని.. అవసరం కూడా అని సూచించారు. అచెంచలమైన ప్రపంచానికి మార్గదర్శిగా తెలుగు భాషను అందించారని వివరించారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే మూడో భాషగా తెలుగు గుర్తింపు పొందిందని తెలిపారు. 50 దేశాల్లో తెలుగును ఎక్కువగా మాట్లాడుతుండటం భాషకు ఉన్న గొప్పదనానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. తెలుగు తమ సంస్కృతిలో అంతర్భాగంగా ఉందని తెలిపారు. ఇండియా, మారిషస్‌లను కలిపే సాంస్కృతిక బంధాలుగా తెలుగు ఉందని వివరించారు. ఈ మహాసభలు తెలుగు ప్రవాసాంధ్రులు, ఖండాల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేస్తుందని వెల్లడిరచారు ధరమ్ బీర్ గోకుల్.
ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తెలుగు భాష పట్ల అపార గౌరవాన్ని, భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ‘‘సినిమా ఈవెంట్లకు వచ్చినట్టుగా ఈ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు పెద్ద ఎత్తున జనం రావడం చూసి ఎంతో సంతోషంగా ఉంది’’ అని ఆయన అన్నారు. మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అని తెలిపారు. తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలంటే… మనలో ఐకమత్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా… తెలుగే మాతృభాష అని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే… సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు. మాతృభాషలో రాణిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తామన్నారు.త్యాగధనులను గుర్తు పెట్టుకుంటే స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, నందమూరి తారక రామారావు ఆత్మగౌరవంతో ముందుకెళ్లారని, తెలుగు జాతి ఉన్నంతవరకు గుర్తుపెట్టుకునే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం కొనియాడారు. మాతృభాష మన మూలాలకు సంకేతమన్న సీఎం, అంగ్లం అవసరం కానీ భాషను మరచిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లు అవుతుందన్నారు.
టెక్నాలజీ వల్ల భాష కనుమరుగవుతుందన్నారు. టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చని, కొత్త యాప్‌లు వచ్చాయని తెలుగులో మాట్లాడితే తెలుగులోనే సమాధానమిస్తాయని పేర్కొన్నారు. కనీసం టైప్ చేయడానికి తెలియనివాళ్లు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుందన్నారు. పొట్టిశ్రీరాములు పేరుతో 1985లోనే ఎన్టీఆర్ తెలుగు వర్సిటీ తీసుకొచ్చారన్నారు. విభజన తర్వాత రాజమండ్రిలో పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ ఇదని, వేదికకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషదాయకమని సీఎం హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తెలుగు భాషకు ఘనమైన చరిత్ర ఉందని, వందలాది భాషలు ఉన్నా మన దేశంలో కేవలం ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించిందన్నారు. ప్రాచీన హోదా లభించిన భాషల్లో తెలుగు ఉండటం మనందరికీ గర్వకారణమని, హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు అని, ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్లమంది తెలుగు మాట్లాడుతున్నారని చంద్రబాబు వివరించారు.
తరతరాల మధ్య కుటుంబ బంధాలను భాష బలపరుస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన తెలుగు భాష పరిరక్షణకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆంగ్లం నేర్చుకోవడం తప్పుకాదు తెలుగు మరచిపోవడం తప్పేనని కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యానించారు.
భాషతోనే సంస్కృతి, జాతి మనుగడ సాధ్యమని అని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లిపిలేని భాషలను సైతం గౌరవించాలన్నారు. తెలుగు పరిరక్షణకు ప్రజలతోపాటు ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, వచ్చే ఆరు నెలల్లోనే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 15 సంవత్సరాల వయసున్న పిల్లలను కొందరిని ఎంపిక చేసి, వీరిలోంచి 10 మంది అవధానులను తయారు చేస్తామని తెలిపారు. వేల మంది పిల్లలు కవితలు, కథలు, నవలలు, ఇతర ఖండకావ్యాలు రాసేలా వారిని తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలుగుతల్లి, ఎన్టీఆర్ విగ్రహాలు, ఆంధ్రా వంటకాలు తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1,500 మంది కవులతో అమరావతికి దివ్య నీరాజనం సమర్పించారు.
మహాసభలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మప్రసాద్, టి.డి.జనార్ధన్, జస్టిస్ మానవేంద్ర రాయ్, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఈ సభలకు తరలివచ్చారు. తమిళనాడు నేత గోపీనాథ్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. సందేశం ఇవ్వడానికి ఇక్కడికి రాలేదని, నాలుగు అమ్మ మాటలు వినటానికి వచ్చా. మాతృభాషను విస్మరిస్తే ఆ జాతి మనుగడ కష్టం. అమ్మను, అమ్మ భాషని గౌరవించే వాళ్లు ఎప్పటికీ తప్పు చేయరు. పిల్లలను మాతృభాషకు దూరం చేయొద్దు. అమ్మ భాషను భావితరాలకు అందించాలి అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి అన్నారు. చాలామంది ఇతర దేశాల్లో తెలుగు భాష కోసం సంఘాల నడుపుతున్నారు. అలాంటి అభిమానులంతా ఈ మహాసభలకు హాజరయ్యారు.
ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదు. తెలుగువారి కోసం, తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషిని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు. మనమంతా అమ్మ భాష అభివృద్ధికి కృషి చేయాలి. తెలుగు మహాసభల లాంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని ఘనంగా చాటాలి. సినిమాల్లో కూడా తెలుగు భాష అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారు. అనేక దేశాల్లో తెలుగును రెండో భాషగా బోధిస్తున్నారు. మాతృభాష మనుగడలో ఉన్నప్పుడు మాత్రమే మన ఉనికి ఉంటుంది. పాఠశాలల్లో పిల్లలు ఆంగ్లం మాట్లాడినప్పటికీ ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడేలా చూడాలి అని తెదేపా నేత టి.డి.జనార్థన్ అన్నారు.
తెలుగు మహాసభలకు హాజరు కావడానికి తొలుత సంకోచించా. ఉద్యోగరీత్యా ఆంగ్లంతో ఎక్కువ సంబంధం ఉంటుంది. అందువల్ల తెలుగులో మాట్లాడడం తక్కువగా ఉంటుంది. బ్రిటిష్ వారి పరిపాలన వల్ల చట్టాలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. వైద్య విద్య కూడా ఆంగ్లంలోనే కొనసాగుతోంది. బ్రిటిష్ వారు వెళ్లిపోయినా.. వారి భాషను మనం కొనసాగించడం వల్ల ఆంగ్లం మనం జీవితంలో భాగమైంది. ఆంగ్ల భాష ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. గుజరాత్లో ప్రభుత్వ పరమైన అన్ని అంశాలు గుజరాతీ భాషలోనే ఉంటాయి. ప్రభుత్వ పరమైన విధానాల వల్ల మార్పు సాధ్యం. మాతృభాషను సంరక్షంచుకోవాలనే ఉద్దేశంతో ఈ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయం. కేవలం ఈ మూడు రోజులు మహాసభల ద్వారానే కాకుండా భాషా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు ప్రయత్నిస్తాను. తమిళనాడులో తమిళ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నేను ప్రాతినిథ్యం వహించే ప్రాంతం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. అప్పట్లో రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతో ఇబ్బంది పడ్డాం. తెలుగు వారైనా మా పిల్లలకు తమిళంలో పరీక్షలు పెట్టారు. ఏ పార్టీ కూడా తమిళనాడులోని తెలుగువారి సమస్యను పట్టించుకోలేదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తమిళనాడులో 40 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే నేనొక్కడినే తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తాను. తమిళనాడు నేతలు తమిళంలోనే ప్రసంగాలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన ఎంపీలు ఎవరూ కూడా తెలుగులో మాట్లాడకపోవడం బాధాకరం’’ అని తమిళనాడు నేత గోపీనాథ్ అన్నారు.
గుంటూరులోని మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉంటూ తెలుగువారి కోసం సేవలందిస్తున్న పలువురుని పురస్కారాలతో సత్కరించారు. వారణాసిలో నాలుగు తరాలుగా తెలుగు వారికి విశిష్ట సేవలందిస్తున్న వేమూరి వెంకట సుందరశాస్త్రికి పూర్ణ కుంభ పురస్కారం అందజేశారు. అనంతపురానికి చెందిన ప్రవాస భారతీయుడు తాళంకి శ్రీధర్ చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకి పూర్ణకుంభ పురస్కారం అందజేశారు. శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా వీరు పురస్కారాలు అందుకున్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష తెలుగు ప్రజలతో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణం అలరారింది. అమృతతుల్యమైన భాషణలతో అతిథులు, ఆకట్టుకునే ప్రసంగాలతో వక్తలు తెలుగు భాష మాధుర్యాన్ని ఆహుతులకు పరిచయం చేశారు. మాతృభాషలోని కమ్మదనాన్ని అడుగడుగునా ఆస్వాదిస్తూ భాషాభిమానులు మురిసిపోయారు.
ప్రధాన వేదికపై తెలుగు తల్లి విగ్రహంతో పాటు, శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమ, ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇవి సభా వేదికకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తెనాలి కళాకారులు రూపొందించిన తుక్కు ఇనుము శిల్పాలు సందర్శకులను విపరీతంగా ఆకర్షించాయి. తెలుగు మహాసభలకు హాజరైన వారికి నోరూరించే ఆంధ్రా వంటకాలను వడ్డించారు. ఈ వేదిక మీదుగా కేవలం తెలుగు భాష గురించి మాత్రమే కాక, చారిత్రక, వారసత్వ సంపదతో పాటు విజ్ఞాన సర్వస్వాన్ని ఒకే చోటకు తీసుకొచ్చి, నేటి తరం యువత, పిల్లలకు పరిచయం చేశారు.
సంప్రదాయ వస్త్రధారణల్లో భాషాభిమానులు సందడి చేయగా సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో చిన్నారులు ఔరా అనిపించారు. 42 దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలిరావడంతో ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. భారీగా పోటెత్తిన సందర్శకులు తెలుగు మహాసభలకు, మాతృభాషకు జై కొట్టారు. ‘ఈనాడు’ వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు హస్తకళల ప్రదర్శనల ప్రాంగణంలోని కళారూపాలు కళాకారుల సృజనకు అద్దంపట్టాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు కర్రసాము లాంటి పురాతన క్రీడలతో తెలుగోడి సత్తా చాటారు. కవి సమ్మేళనాలు, పద్య సదస్సులు తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపించాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక చత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు తెలుగు పాటలతో శ్రోతలను అలరించారు.






