Chandrababu Vs Jagan: రాయలసీమ ద్రోహి ఎవరు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ఒక్క ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంటలు రేపింది. “రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే చంద్రబాబుతో మాట్లాడి ఆపించాను” అని రేవంత్ చెప్పడమే ఆలస్యం.. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ భగ్గుమంది. చంద్రబాబును ‘రాయలసీమ ద్రోహి’గా చిత్రీకరిస్తూ ఆందోళనలకు దిగింది. అయితే, తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా అసలు నిజాలను బయటపెట్టడంతో సీన్ రివర్స్ అయ్యింది. జగన్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని ఆయన ఆధారాలతో సహా చూపించారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో అసలు రాయలసీమ ఎత్తిపోతలకు బ్రేకులు వేసింది ఎవరు? 2019-24 మధ్య ఏం జరిగింది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించారు. అక్రమ ప్రాజెక్టులను ఆపడంలో తాము సఫలమయ్యామని చెప్పే ప్రయత్నంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రస్తావన తెచ్చారు. దీన్ని వైసీపీ అందిపుచ్చుకుంది. తెలంగాణ సీఎంకు తలొగ్గి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, సీమ గొంతు కోశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పలు జిల్లాల్లో నిరసనలకు దిగారు.
వైసీపీ ఆరోపణలు ఇలా ఉంటే.. హరీశ్ రావు మాత్రం తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో లెక్కలతో సహా వాస్తవాలను బయటపెట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల కారణంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా ఆపించింది ఏమీ లేదని, అసలు అక్కడ పనులే జరగడం లేదని తేల్చి చెప్పారు. ఇది పరోక్షంగా జగన్ హయాంలో జరిగిన వైఫల్యాన్ని ఎత్తిచూపినట్లయింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIS) ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి, రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 2020లో జీవో 203ని విడుదల చేసింది. అయితే, దీనికి పర్యావరణ అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఎన్జీటీని ఆశ్రయించింది. విచారణ జరిపిన ఎన్జీటీ, పర్యావరణ అనుమతులు (EC) వచ్చే వరకు పనులు చేపట్టవద్దని స్టే ఇచ్చింది. జగన్ ప్రభుత్వం ఈ అనుమతులు సాధించడంలో విఫలమైంది. అంతేకాకుండా, ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి పనులు చేశారన్న ఆరోపణలపై ఏపీ అధికారులకు కోర్టు ధికార నోటీసులు కూడా వచ్చాయి. ఫలితంగా, టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ను నియమించినా, క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగలేదు. హరీశ్ రావు చెప్పిన పాయింట్ ఇదే. జగన్ హయాంలోనే చట్టపరమైన చిక్కులతో ప్రాజెక్టు స్తంభించిపోయింది.
2024లో జగన్ ఓడిపోయారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. టీడీపీ వచ్చి ఏడాదిన్నరే అయింది. ఎన్జీటీ స్టే ఇంకా కొనసాగుతోంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాయి. ఒకపక్క తెలంగాణతో సత్సంబంధాలు కోరుకుంటున్న చంద్రబాబు, మరోపక్క రాయలసీమ సెంటిమెంట్ ను విస్మరించలేరు. రేవంత్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందిస్తూ.. “మేము ప్రాజెక్టు ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు, చట్టపరమైన అనుమతులు తెచ్చుకుని కడతాం” అని కౌంటర్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే ఆ వ్యాఖ్యలు చేశారని టీడీపీ వాదన.
వాస్తవాలను పరిశీలిస్తే.. ఇక్కడ ఎవరూ పూర్తిగా రైట్ కాదు. ప్రాజెక్టును ఆర్భాటంగా ప్రకటించినా, పర్యావరణ అనుమతులు సాధించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. చట్టపరంగా బలమైన అడుగులు వేయలేకపోవడం వల్లే ప్రాజెక్టు ఎన్జీటీ స్టేలో చిక్కుకుంది. కాబట్టి పనులు ఆగిపోవడానికి ప్రధాన కారణం జగన్ ప్రభుత్వ వైఫల్యమే. రేవంత్ రెడ్డి ‘నేను చెప్తే బాబు ఆపారు’ అని అంటుంటే.. చంద్రబాబు ప్రభుత్వం నుండి గట్టి కౌంటర్ రాకపోవడం సీమ ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. కేసీఆర్ ను కార్నర్ చేయడానికి రేవంత్ వాడిన అస్త్రం.. పక్క రాష్ట్రంలో మంటలు రేపింది. అక్కడ పనులు జరగడం లేదని తెలిసీ, తానే ఆపించానని చెప్పుకోవడం పూర్తిగా రాజకీయ ఎత్తుగడ.
అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతల పనులు జరగడం లేదు. అవి జగన్ హయాంలోనే ఎన్జీటీ కేసుల వల్ల ఆగిపోయాయి. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ఆపిందేమీ లేదు, రేవంత్ ఆపించిందీ ఏమీ లేదు. కానీ, ఇద్దరు సీఎంల మధ్య ఉన్న దోస్తీని అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తుంటే, గతాన్ని గుర్తు చేస్తూ హరీశ్ రావు వాస్తవాలను బయటపెట్టారు. అంతిమంగా రాజకీయ నాయకుల మాటల యుద్ధంలో రాయలసీమ నీటి హక్కులు పక్కదారి పడుతున్నాయన్నది చేదు నిజం.






