Bhogapuram airport : భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది..? అసలు నిజాలివే..!
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులో తొలి ట్రయల్ విమానం విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అయితే, విమానం ల్యాండ్ అయిన మరుక్షణమే ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మొదలైంది. “మా హయాంలోనే పనులు జరిగాయి కాబట్టి ఈ క్రెడిట్ మాదే” అని వైసీపీ వాదిస్తుంటే.. “అసలు ఎయిర్ పోర్టును అడ్డుకోవాలని చూసిందెవరు? ఇప్పుడు సిగ్గులేకుండా క్రెడిట్ ఎలా అడుగుతారు?” అని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది.
ఈ రాజకీయ దుమారం మధ్య అసలు భోగాపురం ఎయిర్ పోర్టు కథేంటి? ఎవరు దీనికి ఆద్యులు? ఎవరు అడ్డుకున్నారు? వాస్తవాల ఆధారంగా విశ్లేషిద్దాం.
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్టు అవసరం ఏర్పడింది. విశాఖపట్నం ఎయిర్ పోర్టు నేవీ ఆధీనంలో ఉండటం, విస్తరణకు ఆటంకాలు ఉండటంతో.. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు’ను ప్రతిపాదించింది.
విజయనగరం జిల్లా భోగాపురాన్ని ఎంపిక చేసి, దాదాపు 2,700 ఎకరాల భూసేకరణను టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. అప్పట్లోనే జీఎంఆర్ సంస్థకు టెండర్లు ఖరారు చేసింది. అన్ని అనుమతులు తెప్పించి 2019 ఎన్నికలకు ముందే శంకుస్థాపన కూడా చేసింది.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్ పోర్టును తీవ్రంగా వ్యతిరేకించారు. భూసేకరణను అడ్డుకున్నారు. “మేము అధికారంలోకి వస్తే ఎయిర్ పోర్టును రద్దు చేసి, భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తాం” అని బహిరంగ సభల్లోనే ప్రకటించారు. ఇవి కేవలం ఆరోపణలు కాదు, దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎయిర్ పోర్టును రద్దు చేయలేదు గానీ, పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. టీడీపీ హయాంలో ఖరారైన టెండర్లను రద్దు చేసి, కొత్తగా రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. కానీ, చివరకు మళ్ళీ జీఎంఆర్ (GMR) సంస్థకే కాంట్రాక్ట్ దక్కింది. ఈ ప్రక్రియలో రెండేళ్ల విలువైన సమయం వృధా అయ్యింది. గత ప్రభుత్వం సేకరించిన 2,700 ఎకరాల్లో.. ఎయిర్ పోర్టుకు కేవలం 2,200 ఎకరాలు కేటాయించి, మిగిలిన 500 ఎకరాలను వెనక్కి తీసుకున్నారు. 2019లో జరగాల్సిన పనులను 2023 వరకు నాన్చారు. న్యాయపరమైన చిక్కులు, టెండర్ల పేరుతో కాలయాపన చేసి, ఎన్నికలకు ఏడాది ముందు మే 2023లో జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అదే ఎయిర్ పోర్టుకు రెండోసారి శంకుస్థాపన చేశారు. అయితే, ఆ తర్వాత పనులు నత్తనడకన సాగాయి.
2024లో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే భోగాపురం పనులు పరుగులు పెట్టాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రన్ వే పనులు పూర్తి చేసి, నేడు ట్రయల్ రన్ నిర్వహించే స్థాయికి ప్రాజెక్టును తీసుకొచ్చారు.
నిష్పక్షపాతంగా విశ్లేషిస్తే.. భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో “విజన్, ప్రారంభం, ముగింపు” అన్నీ టీడీపీ ఖాతాలోకే వెళ్తాయి. విశాఖకు ప్రత్యామ్నాయంగా భోగాపురాన్ని ఎంపిక చేసింది, కష్టసాధ్యమైన భూసేకరణను పూర్తి చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పడం, అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాటు పనులను పక్కన పెట్టడం వైసీపీకి మైనస్ పాయింట్స్. ఒకవేళ 2019 నుంచే పనులు జరిగి ఉంటే, ఈ ఎయిర్ పోర్టు రెండేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చేది. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేయకపోవడం మంచిదే అయినా, అనవసర జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది. ఇప్పుడు వైసీపీ “మేమే కట్టాం” అని చెప్పుకోవడం రాజకీయ లబ్ధి కోసమే తప్ప, క్షేత్రస్థాయిలో వారు చేసింది తక్కువ.
భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, గణాంకాలు, చరిత్ర మాత్రం టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నాయి. నాడు “ఎయిర్ పోర్టు వద్దు” అని పోరాడిన వారే, నేడు “ఆ ఎయిర్ పోర్టు మా ఘనత” అని చెప్పుకోవడం రాజకీయ వైచిత్రి. ఒక కలగా మొదలై, వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ఈ ప్రాజెక్టు.. చివరకు దాన్ని కన్నవారి చేతుల మీదుగానే పూర్తి కావడం యాదృశ్చికమే అయినా, అది చరిత్ర చెప్పే సత్యం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇదొక నాంది మాత్రమే!






