YSR congress: వైసీపీకి ఏమైంది..? నిన్న రప్పా,రప్పా.. నేడు చీకట్లో పనైపోవాలంటూ వ్యాఖ్యలు…?

ఐదేళ్లు అధికారం, పదేళ్ల ప్రతిపక్ష బాధ్యతలు.. ఇంత చరిత్ర ఉన్న వైఎస్సార్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. అసలీ పార్టీ ఎటు వెళ్తోంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఓ పార్టీ నేతలుగా ఉండి.. రప్పారప్పా వ్యాఖ్యలు చేయడం ఏంటి..? అది.. తమ పార్టీలో ఓ నేత రప్పా, రప్పా అని గొర్రెలను నరికినట్లు నరికేయాలంటే.. అధినేత జగన్ అలా సింపుల్ గా స్పందించడం , ప్రజల్లోకి దారుణమైన సంకేతాలు పంపుతుంది. ఈ విషయం కూడా వారికి అర్థమైందో.. లేక అర్థం కానట్లు నటిస్తున్నారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.
అధినేత ఎప్పుడైతే అంత సింపుల్ గా స్పందించారో…. ఇక నేతలందరూ ఒకొక్కరుగా రప్పా, రప్పా అంటూ రాగాలు తీస్తున్నారు. లేటెస్టుగా మాజీ మంత్రి, వైసీపీనేత పేర్ని నాని… రప్పా, రప్పా అనడం కాదు.. చీకట్లో కన్నుకొడితే పనైపోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీకట్లో పనైపోవాలంటూ నాని అనడంపై.. అధికార కూటమి నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల సత్యనారాయణ, సీనియర్ నేత ఉమ సహా పలువురు నేతలు…పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించారు.
అది పక్కన పెడితే .. నాయకులే రప్పా, రప్పా అని పిలుపునిస్తే కార్యకర్తలు ఎలా ఉంటారు.. కార్యకర్తలు రెచ్చిపోతే దాని ఫలితాలు ఎలా ఉంటాయి. వారెవరినైనా రప్పా,రప్పా అని నరికేస్తే.. దానికి బాధ్యత ఎవరిది..? ఎవరు తీసుకుంటారు.. దీనికి బాధితులుగా మారిన వారికి ఎవరు ఆదుకుంటారు. ఇక వారు తిరిగి తాము అధికారంలో ఉన్నాం కదా అని అదే .. చీకట్లో పని కానిస్తే దానికి ఎవరు బాధ్యులు.. అసలు రాష్ట్రంలో రప్పా, రప్పా అని నరికేసుకుంటే ఇక పోలీసులు ఎందుకు..? పాలన ఎందుకు..? ప్రజాస్వామ్యం ఎందుకు..? అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకుని మాట్లాడితే బాగుండే పరిస్థితి. అంతేకాని.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే ఎలా .. ఈమాత్రం చిన్న లాజిక్ మిస్సైతే కష్టమే కదా.. !
తాము అధికారంలో లేమన్న సంగతి వైసీపీ నేతలకు తెలుసు. పవర్ లో లేని విపక్షానికి పోలీసుల మద్దతు ఉండదు. మరి రప్పా, రప్పా అని నరకడాలు మొదలైతే.. ఆపార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉంటారు.. అధికార పార్టీ నేతలు తిరిగి నరికితే.. వారిని ఆదుకునేవారెవరు.? వారికి ఉన్న ఊళ్లో రక్షణ ఉంటుందా..? శాంతి భద్రతలు అదుపు తప్పితే.. దాన్ని సాకుగా చూపించి, ఈ అంశాన్ని జాతీయ దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ఇలా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.