Sankranthi: జనవరిలో ఊహించని వర్ష సూచనలు.. పండుగ జోష్‌పై ప్రకృతి ప్రభావం
సాధారణంగా డిసెంబర్‌తో క్యాలెండర్ ఇయర్ ముగిసిన తర్వాత వర్షాలకు కూడా విరామం పడుతుందని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా జనవరిలోకి అడుగుపెట్టగానే వాతావరణం ప్రశాంతంగా ఉంటుందన్న అంచనా ఉంటుంది. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే సంవత్సర ఆరంభంలో వర్షాలు కురుస్తాయి. అలాంటి పరిస్థితుల్లో తెలుగువారికి, ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజలకు అత్యంత ప్రాముఖ్యమైన పండుగ సంక్రాంతి (Sankranti) సందర్భంగా ఇప్పుడు అందరిని రాబోయే వానలు టెన్షన్ పడుతున్నాయి. ఈ పండుగ కోసం ఏడాది పొడవునా ఎదురుచూసే కుటుంబాలు, గ్రామాలు, పట్టణాలు ముందుగానే సంబరాలకు సిద్ధమవుతాయి.
అయితే ఈసారి సంక్రాంతి ఉత్సాహానికి ఆటంకం కలిగించేలా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఏపీ (Andhra Pradesh) వైపు ఒక వాయుగుండం కదులుతోందన్న వార్తలు ఇప్పటికే ఆందోళన కలిగించాయి. మొదట వాతావరణ నిపుణులు ఈ వాయుగుండం పెద్దగా బలపడదని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలకు భిన్నంగా, తాజాగా అది తీవ్ర వాయుగుండంగా మారడం చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే, అది తుపానుగా మారే అవకాశమూ లేకపోలేదన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో (Southwest Bay of Bengal) ఏర్పడి, శ్రీలంక (Sri Lanka) సమీపంలో కేంద్రీకృతమై ఉంది. తాజా సమాచారం ప్రకారం, శనివారం రోజున ఇది శ్రీలంకలోని ట్రింకోమలి (Trincomalee) ,జాఫ్నా (Jaffna) మధ్య తీరాన్ని దాటినట్టు అంచనా వేస్తున్నారు. వాయుగుండం దిశ మార్పులు, బలపాటు కారణంగా దాని ప్రభావం దక్షిణ భారత తీర ప్రాంతాలపై పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో ఆదివారం ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు (SPSR Nellore), చిత్తూరు (Chittoor), తిరుపతి (Tirupati) జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో బాపట్ల (Bapatla), పల్నాడు (Palnadu), ప్రకాశం (Prakasam) జిల్లాల్లో కూడా వర్ష సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండు రోజులు, అంటే శని , ఆదివారాల్లో, ఏపీతో పాటు తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala) రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.
వర్షాలు నిరంతరంగా కురిస్తే, సంక్రాంతి సంబరాలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. గ్రామాల్లో జరిగే భోగి మంటలు, హరిదాసుల సందడి, పల్లె పండుగలు వర్షాల వల్ల తగ్గిపోవచ్చన్న భయం ఉంది. రైతులు కూడా పంటలు, కోత పనులపై ప్రభావం పడుతుందేమోనని ఆలోచిస్తున్నారు. అయితే ప్రకృతి తీరును పూర్తిగా ముందే అంచనా వేయడం కష్టమే. ఈ వాయుగుండం ఎంతవరకు ప్రభావం చూపుతుందో, సంక్రాంతి జోష్‌కు ఎంత మేర ఆటంకం కలిగిస్తుందో చూడాల్సిందే..






