Chandrababu: కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన మూడు కీలక సమస్యలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి మూడు కీలక సమస్యలు తలనొప్పిగా మారాయి. ఈ మూడు విషయాలపై పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ పరిణామాలను గమనించలేదా? లేక ఆయనకు విషయాలు తెలియనీయకుండా కొందరు అధికారులు, నాయకులు మౌనంగా ఉంటున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో ఊపందుకుంటున్నాయి.
మొదటి అంశం స్మార్ట్ మీటర్లు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పాత మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని వెనుక అదానీ గ్రూప్ (Adani Group) సంబంధిత కంపెనీ ఉందని ప్రజలు చెబుతున్నారు. కానీ ఈ ప్రక్రియపై ప్రజల వద్ద నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యకరం. కొంతకాలం క్రితం చంద్రబాబుకు మద్దతుగా ఉన్న వామపక్ష నాయకులు కూడా ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకుని ఉద్యమిస్తున్న విషయం గమనించదగినది.
రెండో సమస్య అమరావతి రాజధాని పరిధిలో భూసేకరణ. ఇప్పటికే సుమారు 34 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించగా, తాజాగా మరో 44 వేల ఎకరాలు తీసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చూస్తోంది. అయితే గతంలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ తమకి పూర్తి న్యాయం జరగలేదని వారు చెబుతున్నారు. అందుకే కొత్తగా భూములు ఇవ్వడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. అయినా ప్రభుత్వం దీన్ని పట్టుదలగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఇక్కడ చంద్రబాబు స్వయంగా రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నా, అది జరగకపోవడం చర్చనీయాంశమైంది.
ఇక మూడవ సమస్య ప్రకాశం (Prakasam) జిల్లాలో ఇండోసోల్ (Indosol) సంస్థకు భూముల కేటాయింపు. ఈ సంస్థకు సుమారు 4,500 ఎకరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కోసం దీనిపై చర్చ జరుగుతోంది. కానీ గతంలో ఇదే సంస్థను వ్యతిరేకించిన ప్రభుత్వం ఇప్పుడు భూములు కేటాయించడాన్ని వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రైతులు కూడా తాము చనిపోతాం గానీ భూములు మాత్రం ఇవ్వం అంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మూడు సమస్యలు ఇలాగే వదిలేస్తే కూటమిపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది . ప్రజల అసహనం రోజు రోజుకీ పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులపై తక్షణమే స్పందించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందడుగు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది.