Jagan: తనకు నిజమైన సవాల్ ఎవరినుంచో జగన్ గ్రహించడంలో తడబడుతున్నారా..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం మరో ఆసక్తికర చర్చ షురూ అయ్యింది . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy)కి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా చాలామందికి మొదట గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu). కానీ గత కొంతకాలంగా రాజకీయ విశ్లేషకులు మాత్రం అసలు ప్రత్యర్ధి వేరే అంటున్నారు . జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు జగన్‌కి అసలైన రాజకీయ ప్రత్యర్థిగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది.
2014 ఎన్నికలకు ముందు నుంచే పవన్ రాజకీయ రంగప్రవేశం చేసినా, ఆయన ప్రభావం మాత్రం పెద్దగా కనిపించ లేదు. తనకంటూ ప్రత్యేక పార్టీగా జనసేనను స్థాపించిన తర్వాత ఆయన బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని కూటమి అధికారంలోకి రావడంలో మద్దతుగా నిలిచారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్‌కి (YSR Congress) అధికారం దక్కకుండా చేసిన కీలక అంశాలలో ఒకటిగా భావించవచ్చు. ప్రజల్లో పవన్‌కు ఉన్న అభిమానంతో ఆయన ఇచ్చిన మద్దతు ఎన్నికల పై , వైసీపీ పై ప్రభావం చూపింది అనే విషయం వాస్తవమే.
2019లో పరిస్థితులు మారాయి. అప్పుడు పవన్ తన పార్టీకే ప్రత్యేకంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం బహుశా పొత్తులపై ఉన్న అసమ్మతి కారణంగానే తీసుకున్నారేమో. కానీ రాజకీయంగా అది పూర్తి ఫలితాన్నివ్వలేదు. ప్రజలు ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. కానీ ఓటమి తర్వాత కూడా పవన్ తన పోరాటం ఆపలేదు ..వైసీపీ పై ఎదురు దాడికి సన్నద్ధమయ్యారు. 2024 ఎన్నికలు ముగిశాక, రాజకీయ వర్గాల్లో పవన్ మీద మరింత ఆసక్తి పెరిగింది. ఆయన ఈసారి నేరుగా జగన్‌ను టార్గెట్ చేశారు. టీడీపీతో కలిసి పోటీ చేయడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేకతను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఫలితంగా అధికారంలోకి వచ్చారు. ఇది చూస్తే పవన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ తక్కువ అంచనా వేసినట్టే అనిపిస్తుంది. అధికారాన్ని కోల్పోవడానికి ఓ కారణం ఇదే కావచ్చు.
తాజా పరిణామాల ప్రకారం, పవన్ మరోసారి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో చూస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. ఇది చూస్తే టీడీపితోకన్నా వైఎస్సార్‌సీపీకే పవన్ అసలైన ప్రత్యర్థిగా మారారని అర్థమవుతోంది. ఒక రకంగా జగన్ 2024 ఎన్నికల సమయంలో తన ప్రత్యర్థి విషయంలో తప్పుడు అంచనా వేయడమే అతని ఓటమికి కారణమైంది అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. వచ్చే ఎన్నికల సమయానికి జగన్ కరెక్ట్ వ్యూహం తో రావాలి అంటే తన బలంతో పాటు ప్రత్యర్థి బలం పై కూడా అవగాహన తెచ్చుకోవాలి. మరి జగన్ ఈ విషయం లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..