Premier Energies: తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్.. ఏపీలో రూ.5,942 కోట్లతో
ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ (Premier Energies) రూ.5,942 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. తెలంగాణ (Telangana)కు చెందిన ప్రముఖ సౌరశక్తి సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుందని హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా(Nellore District) నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్‌లో అత్యాధునిక సౌర తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని ఈ సందర్భంగా లోకేశ్ వెల్లడించారు.ఈ ప్రాజెక్టులో 4 గిగావాట్ టాప్కాన్ సోలార్ సెల్ యూనిట్‌తో పాటు 5 గిగావాట్ సిలికాన్ ఇన్గాట్, వాఫర్ ప్లాంట్ కూడా ఉండనుందని వివరించారు. దీని ద్వారా సుమారు 3,500 ప్రత్యక్ష ఉద్యోగాలు కలగనున్నాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రికార్డు సమయంలో చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఏపీఐఐసీ ద్వారా 269 ఎకరాల భూమిని వేగంగా కేటాయించామని మంత్రి తెలిపారు.
గత 2024 అక్టోబరులో దీనిపై కార్యాచరణలు ప్రారంభమై 2025 ఫిబ్రవరిలో భూమి కేటాయింపుతో పూర్తి అయ్యిందని లోకేశ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ కేంద్రంగా నిలబెట్టే ఈ ప్రాజెక్టు, పరిశ్రమల వృద్ధికి, యువతకు గ్రీన్ జాబ్స్ సృష్టించడంలో దోహదం చేయనుందని ఆయన అభిప్రాయపడ్డారు.







