Jagan: తోతాపురి మామిడి రైతుల కోసం జగన్ పర్యటనపై రాజకీయ వేడి..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రైతుల సమస్యల చుట్టూ మరోసారి రాజకీయ వేడి పెరుగుతోంది. చిత్తూరు జిల్లా (Chittoor District) బంగారుపాళ్యం (Bangarupalem)లో తోతాపురి మామిడి పంటకు సంబంధించిన సమస్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) రైతులను పరామర్శించేందుకు ఈ నెల 9న పర్యటనకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ పర్యటన రాజకీయ దుమారానికి దారితీసింది.
వైఎస్ జగన్ పర్యటనపై తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. APSAM వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి (Marreddy Srinivasareddy) మాట్లాడుతూ, మామిడి రైతుల కోసం ప్రభుత్వం కిలోకు ₹12 మద్దతు ధర నిర్ణయించిందని చెప్పారు. ఇందులో ₹8 ను ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు చెల్లిస్తే, మిగిలిన ₹4 ను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. అయినా జగన్ తప్పు ప్రచారం చేస్తున్నారని, అసలు విషయాలను తప్పుదోవ పట్టిస్తూ రైతులను దిక్కుతెగ్గించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ (Saptagiri Prasad) కూడా జగన్ పర్యటనపై వ్యంగ్యంగా స్పందించారు. ఆయనకు మామిడి కాయల రకాలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. జగన్ రైతులను కలవడం కంటే రాజకీయ లబ్ధి పొందేందుకే ఈ పర్యటనను ప్రణాళికలో పెట్టారని ఆరోపించారు. జగన్ పర్యటనను “వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి కాశీ యాత్రకు వెళ్లినట్టుగా” ఉంది అని అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు స్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) మాట్లాడుతూ, రైతులు స్వయంగా తమ కష్టాలు చెప్పేందుకు జగన్ రాక కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆయన వస్తే తమ గోడును వివరించాలని రైతులు భావిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటనలు చేయడానికే పరిమితం అయిందని, వాటి అమలులో స్పష్టత లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రేటుకు సరిపడే కొనుగోళ్లు జరగలేదని తెలిపారు.
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) కూడా ప్రభుత్వ వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అనుమతుల విషయంలో అడుగడుగునా అభ్యంతరాలు పెడుతున్నారని ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హుటాహుటిన చిత్తూరు వెళ్లి ప్రకటించిన మద్దతు ధరలు కూడా కేవలం ప్రచారమేనని విమర్శించారు. ఈ నేపథ్యంలో మామిడి రైతుల సంక్షేమంపై రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు కొనసాగుతుండటంతో, వ్యవసాయ క్షేత్రంలో రైతులకు ఎటువంటి వాస్తవ ప్రయోజనం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.