Pawan Kalyan: భాష రాజకీయాలకు వద్దు – హిందీకి మద్దతుగా పవన్ కల్యాణ్ స్పష్టమైన సందేశం

ఇటీవల దేశవ్యాప్తంగా భాషలపై వివాదాలు మరింత ముదురుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు (Tamil Nadu), కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharashtra) లాంటి చోట్ల హిందీ భాషపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. త్రిభాషా విధానంలో హిందీని తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హిందీ భాషకు మద్దతుగా చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ (Hyderabad) లో జరిగిన హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్, హిందీని మన దేశ రాజభాషగా అభివర్ణించారు. మాతృభాషలు ప్రతి ఇంట్లో ఉపయోగించే భాషలైతే, హిందీ భాష రాష్ట్రాలు దాటి అందరినీ కలిపే భాష అని పేర్కొన్నారు. ఉర్దూ, పర్షియన్ వంటి ఇతర భాషలను మనం గౌరవిస్తున్నప్పుడు హిందీ విషయంలో మాత్రం నిరసన ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్నవారు కూడా హిందీ నేర్చుకుంటున్న నేపథ్యంలో, మనమే ఎందుకు దీనికి వ్యతిరేకంగా వ్యవహరించాలి అని ప్రశ్నించారు.
పవన్ తన వ్యక్తిగత అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ, తాను నటించిన “ఖుషీ” (Kushi) సినిమాలో హిందీ పాటను చేర్చిన సంగతి గుర్తు చేశారు. అది హిందీ భాషపై తన ప్రేమకు నిదర్శనమని చెప్పారు. హిందీని వ్యతిరేకించడంలో లాజిక్ లేదు, భావితరాల అభివృద్ధికి ఇది అడ్డుపడే అంశమని పేర్కొన్నారు. ప్రాంతీయతకు పట్టం కడుతూ, భాషను కూడా రాజకీయంగా మార్చటం సరికాదని స్పష్టం చేశారు. దేశంలో ఉండే అన్ని భాషలు విలువైనవే. కానీ, హిందీ భాషకు ఉన్న ప్రాముఖ్యతను ఇన్‌డ్‌స్ట్రీ, వాణిజ్యం, విద్య లాంటి రంగాల్లో స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విడుదలవుతున్న సినిమాల్లో 30 శాతం హిందీలోకి డబ్ అవుతున్నాయని పవన్ వివరించారు. కమ్యూనికేషన్ మాధ్యమంగా హిందీ ఉపయోగపడుతోందని చెప్పారు.
భాష అనేది కలుపుకునే సాధనం కావాలని, తేడాలు తేల్చే ఆయుధంగా మారకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హిందీకి వ్యతిరేకత చూపించే వారు ఆ విషయాన్ని ఆలోచించాలని సూచించారు. ఒక దక్షిణాదీ నాయకుడిగా పవన్ హిందీకి ఇచ్చిన మద్దతు పలువురిని ఆకట్టుకుంది. ఆయన స్పీచ్ హిందీ మద్దతుదారులకు విశ్వాసాన్ని ఇచ్చింది, అదే సమయంలో వ్యతిరేకంగా ఉన్నవారిని ఆలోచింపజేసేలా ఉంది.