Nikki Haley: భారత్ విషయంలో ట్రంప్ వ్యూహాత్మక వైఫల్యం.. విరుచుకుపడిన నిక్కీ హేలీ..
భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలను ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయభారి నిక్కీహేలీ (Nikki Haley) అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత వరకూ ఢిల్లీతో వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. ఢిల్లీతో స్నేహం కోల్పోతే అది అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందన్నారు హేలీ. ఇరుదేశాల మధ్య ఉన్న ఒడుదొడుకులను తగ్గించుకునే దిశగా అడుగులేయాలని సూచించారు.
భారత్- అమెరికా సంబంధాలు విచ్ఛిన్న దశలో ఉన్నాయన్నారు హేలీ. న్యూఢిల్లీని స్వేచ్ఛాయుత భాగస్వామిగా పరిగణించాలన్నారు. చైనా (China)లాగా ప్రత్యర్థిగా చూడకూడదన్నారు. రష్యా నుంచి బీజింగ్ కూడా పెద్దఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. దానిపై ఆంక్షలు విధించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో అమెరికా ఉంటే.. వెంటనే భారత్‌కు చేరువ కావాలని సూచించారు. లేదంటే అది యూఎస్‌కు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందన్నారు.
యూఎస్‌లో ఉత్పత్తి చేయలేని వస్త్రాలు, చవకైన ఫోన్లు, సోలార్ ప్లేట్స్ వంటి వాటిని చైనా తరహాలో చేయగల సామర్థ్యం భారత్‌కు మాత్రమే ఉందని నిక్కీ హేలీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఇజ్రాయెల్ వంటి అమెరికా మిత్ర దేశాలతో న్యూఢిల్లీ తన సైనిక సంబంధాలు పెంచుకుంటుందన్నారు. మధ్యప్రాచ్యంలో దానికి ఆదరణ పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో భారత్ ప్రాముఖ్యం మరింత పెరుగుతుందన్నారు. 2023లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించిందన్నారు.
భారత డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను నిక్కీ తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారత్ ఒకటని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ సామర్థ్యం పెరిగేకొద్దీ.. ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనే చైనా ఆశయాలు కుంచించుకుపోతాయన్నారు.







