Nara Lokesh: వైసీపీ కుట్రలను తిప్పికొట్టండి: లోకేశ్
వైసీపీలా రప్పారప్పా విధానం తమది కాదని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ మంత్రుల (TDP ministers)తో మంత్రి లోకేష్ అల్పాహార విందు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో లోకేష్ పలు కీలక సూచనలు చేశారు. జగన్‌లా ప్రజల్ని భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి టీడీపీ (TDP) సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎంత మేర సేవ చేశామన్నదే మన అజెండా కావాలని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూర్చామన్నదే కూటమి ప్రభుత్వ విధానమని తేల్చిచెప్పారు. వైసీపీ కుట్రలను పార్లమెంట్ వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని, పార్లమెంట్ కేంద్రాల్లో నేతలు ఏకతాటిపైకి వచ్చి వైసీపీ అసత్య ప్రచారాలకు ధీటుగా బదులివ్వాలని సూచించారు. మంత్రులు ప్రజావేదికలో తమకు వచ్చే ఫిర్యాదులు పరిష్కారమయ్యేలా బాధ్యత తీసుకోవాలని చెప్పారు. తమ తమ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి మంత్రులు చొరవ చూపాలని ఆదేశించారు. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్‌ఛార్జి మంత్రులు పనిచేయాలని పిలుపునిచ్చారు.






