Lulu Mall: విశాఖకు తిరిగి వస్తున్న లులు మాల్.. ఆర్థిక అభివృద్ధి పై చిగురిస్తున్న ఆశలు..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా (AP Economic Capital) ఎదుగుతున్న విశాఖలో (Vishaka) అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణం కోసం లులు గ్రూప్ (Lulu group) మరోసారి ముందుకు వచ్చింది. విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో సుమారు 13.43 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖలోని వ్యాపార, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభించనుంది.
ఇప్పటికే 2018లోనే అప్పటి చంద్రబాబు (Chandra Babu) ప్రభుత్వం లులు మాల్ (Lulu Mall) నిర్మాణానికి ఓకే చెప్పింది. భూమి కేటాయింపులు కూడా జరిగాయి. కానీ, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత..జగన్ (Jagan) నేతృత్వంలో విధానాలు మారిపోవడంతో లులు గ్రూప్ విశాఖలో తమ ప్రాజెక్ట్‌ను వెనక్కి తీసుకుంది. అదే సమయంలో హైదరాబాద్‌లో మాత్రం లులు గ్రూప్ తన మాల్‌ను విజయవంతంగా ప్రారంభించింది. అయితే 2024లో చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తర్వాత విశాఖలో లులు మాల్ ప్రాజెక్ట్‌ను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఎండీ ఎంఏ యూసఫ్ అలీ (Lulu Mall MD Yousuf Ali) చంద్రబాబును కలిసి తమ ఆసక్తిని వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెంటనే భూకేటాయింపుల ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది.
విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా లులు గ్రూప్‌తో ఒప్పందం కుదిరింది. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. తాజాగా, ఏపీఐఐసీ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో లులు మాల్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ మాల్లో ప్రపంచ స్థాయి హైపర్ మార్కెట్, పిల్లల వినోద కేంద్రం, విస్తృతమైన ఫుడ్ కోర్ట్, 8 స్క్రీన్ల ఐ మ్యాక్స్ థియేటర్స్‌తో అత్యంత ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. ఇది నగరంలోని వ్యాపార రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, పర్యాటక రంగానికి కూడా బలాన్ని అందించనుంది. ముఖ్యంగా, ఈ మాల్ ద్వారా దాదాపు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
విశాఖను పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన హబ్‌గా మార్చాలని చంద్రబాబు అనేక ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నారు. లులు మాల్ అందులో ఒకటిగా, నగరానికి ఒక కొత్త ఆకర్షణగా మారబోతోంది. ఈ మాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత విశాఖ అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే మరిన్ని ప్రపంచ స్థాయి కంపెనీలు విశాఖ వైపు మొగ్గు చూపే అవకాశముంది.







