Singaiah: సింగయ్య కేసులో కొత్త మలుపు.. భార్య వ్యాఖ్యలతో పెరుగుతున్న అనుమానాలు..

గుంటూరు (Guntur) జిల్లా సత్తెనపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న సింగయ్య (Singaiah) మరణం కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగేలా కనిపిస్తోంది. జూన్ 18న జరిగిన ఈ ఘటనపై ఇప్పటి వరకూ ఒక స్పష్టమైన దిశలో దర్యాప్తు సాగుతుందని అనిపించినా, తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలతో ఇప్పుడు కేసు తిరిగి విచారణ అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సింగయ్య భార్య లూర్దు మేరీ (Lourdu Mary) మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాటల ప్రకారం, తన భర్త ప్రమాదవశాత్తు కారు కిందపడి చనిపోలేదని స్పష్టం చేశారు. ఆసుపత్రికి తరలించే వరకూ ఆయన శరీరంపై పెద్దగా గాయాలే కనిపించలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మరణం పట్ల తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
లూర్దు మేరీ, పోలీసులపై మరియు రాజకీయ నాయకులపై కూడా గంభీర ఆరోపణలు చేశారు. పోలీసులు తమపై ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు పెట్టాలని చెప్పారని పేర్కొన్నారు. అంతేకాదు, కొందరు రాజకీయ నేతలు తమ ఇంటికి మళ్ళీ..మళ్ళీ వచ్చి వారు చెప్పే మాటలను నిజంగా పరిగణించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని తెలిపారు. లోకేష్ (Lokesh) పేరు చెప్పి వచ్చిన నేతలు బెదిరించారని వివరించారు.
ఆ ఘటన జరిగిన సమయంలో సంఘటన స్థలానికి వెళ్లడానికి కూడా పోలీసుల నుంచి అనుమతి లభించలేదని ఆమె వాపోయారు. “సింగయ్యను అంబులెన్సులో తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ, కారు ప్రమాదం జరిగితే గాయాలు తీవ్రంగా ఉండాలి. అలాంటివి లేనప్పుడు ఈ మరణం సహజమా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి,” అని ఆమె చెప్పారు.
ఈ ఘటన జరిగిన రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) రెంటపాళ్ల (Rentapalla) ప్రాంతంలో పర్యటించటం జరిగింది. ఈ కేసులో ఆయనను రెండవ నిందితుడిగా పేర్కొంటూ కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఆ కేసుపై హైకోర్టు ఇటీవల స్టే (Stay) ఇచ్చింది. లూర్దు మేరీ తాజా వ్యాఖ్యలతో ఈ కేసు తిరిగి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఉన్న సమాచారానికి ఆమె చెబుతున్న విషయాలకు అస్సలు పొంతన లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్న విషయం పై స్పష్టత లేదు. మొత్తానికి సింగయ్య కేసు ఏపీ రాజకీయాలలో పెను సంచలనానికి నాంది పలికేలా కనిపిస్తోంది..