TDP: అమెరికా వదిలి రండి, టీడీపీ నేతలకు అధిష్టానం వార్నింగ్??

ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ ప్రజల్లోనే తిరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఇచ్చిన ఆదేశాలతో ఒక్కొక్కరు పరుగులు పెడుతున్నారు. కీలక నాయకుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.
ముఖ్యమంత్రి ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు తీరుపై అసహనం వ్యక్తం చేయగా.. ఆ తర్వాత నుంచి మంత్రులు ఎంపీలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజధానికి దూరంగా ఉంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్చార్జి మంత్రులతో పాటుగా.. ఎంపీలు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కష్టపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తానా సభలకు అమెరికా వెళ్ళిన టీడీపీ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు అందరూ తిరిగి నియోజకవర్గాలకు రావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు టీడీపీ వర్గాలు అంటున్నాయి. కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వకుండా వెళ్ళారు అనే అంశంలో కూడా చంద్రబాబు(Chandrababu Naidu) సీరియస్ గా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇక అమెరికా వెళ్లేందుకు టికెట్ లు బుక్ చేసుకున్న ఒకరిద్దరు మంత్రులు సైతం టికెట్ లు క్యాన్సిల్ చేసుకున్నారట. ఓ ఎంపీ కూడా తిరిగి వచ్చేసినట్టు సమాచారం. ఈ కార్యక్రమాన్ని రాబిన్ శర్మ టీం మానిటర్ చేస్తున్నట్టు టీడీపీ వర్గాలు అంటున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారంతో పాటుగా ఇంచార్జ్ మంత్రులు ఎంత వరకు ఈ విషయంలో కష్టపడుతున్నారనే అంశాలను రాబిన్ శర్మ టీం సేకరిస్తోంది. ఇక రాష్ట్రంలోనే ఉండి కార్యక్రమాలకు దూరంగా ఉండే నాయకులపై కూడా పార్టీ నాయకత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.