Amaravati: అమరావతి రెండో విడత భూసేకరణకు బ్రేక్..! పునరాలోచనలో చంద్రబాబు..!?

ఏపీ రాజధాని అమరావతి కోసం (Amaravati) రెండో విడత భూసేకరణ (land procurement) జరపాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు విధివిధానాలను కూడా నోటిఫై చేసింది. మంత్రి నారాయణ (Minister Narayana) ఈ భూసేకరణలో చాలా బిజీగా ఉన్నారు. అయితే రెండో విడత భూసేకరణపై అనేక విమర్శలు వచ్చాయి. మొదటి విడత భూమి సేకరించిన వాళ్లకే ఇంతవరకూ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని, అమరావతి నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదని విమర్శించారు. ఇన్ని సమస్యలు పెట్టుకుని రెండో విడత భూసేకరణ చేయడం సబబు కాదని వాదించారు. ఈ విషయంలో చంద్రబాబు తప్పు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు, అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
అయితే తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి రెండో భూసేకరణపై చర్చ జరిగినట్లు సమాచారం. అమరావతి ప్రాంత రైతులు కొంతమంది భూసేకరణపై అభ్యంతరం చెప్తూ తన వద్దకు వచ్చినట్లు జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) లేవనెత్తారట. వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) కూడా జోక్యం చేసుకుని ఈ అంశం తన వరకూ కూడా వచ్చిందని, దీనిపై పునరాలోచిస్తే మంచిదని సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) సూచించారట. వెంటనే జోక్యం చేసుకున్న చంద్రబాబు దీనిపై మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి, లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుందమని చెప్పారట. దీంతో రెండో విడత భూసేకరణకు తాత్కాలిక బ్రేక్ పడిందని సమాచారం.
అయితే ఇంతటి కీలక నిర్ణయం తీసుకునే ముందు భాగస్వామ్య పక్షాలైన జనసేన (Janasena), బీజేపీలకు (BJP) సమాచారం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇంతవరకూ ఎప్పుడూ కూటమి పార్టీల మధ్య గ్యాప్ వచ్చినట్లు బయటకు రాలేదు. అయితే తొలిసారి అమరావతి రెండో విడత భూసేకరణపై కేబినెట్లో జనసేన మంత్రులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది. దీన్ని బట్టి దీనిపై టీడీపీ, జనసేనకు సమాచారం ఇవ్వలేదని అర్థమవుతోంది.
జనసేన అభ్యంతరాలతో ప్రస్తుతానికి రెండో విడత భూసేకరణకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అంతేకానీ భూసేకరణ ఆగిపోయిందని చెప్పలేం. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కొంతమంది రైతులను కూడా ఒప్పించింది. భవిష్యత్ అవసరాల దృష్య్టా అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం చేతిలో విస్తృతంగా భూమి ఉండాలనేది టీడీపీ ఆలోచనగా ఉంది. అప్పుడే నగరాన్ని పక్కా ప్లాన్ ప్రకారం నిర్మించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారట. కాబట్టి ప్రస్తుతానికి భూసేకరణ ఆగినప్పటికీ ఇదే ఫైనల్ అనుకోవడానికి వీల్లేదు. సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే పవన్ కల్యాణ్ జోక్యంతో దీనికి బ్రేక పడిందనే చెప్పొచ్చు.