Karedu: ఇండోసోల్‌పై కరేడు తిరుగుబాటు… చంద్రబాబు సర్కార్ కుమ్మక్కయిందా..!?

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉలవపాడు (ulavapadu) మండలంలోని కరేడు (Karedu) గ్రామం గత వారం రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఇండోసోల్ (Indosol) సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇక్కడ దాదాపు 8,500 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమవుతుండటంతో గ్రామస్తులు, రైతులు తీవ్ర నిరసనలు చేపడుతున్నారు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా “చావైనా చస్తాం, కానీ భూములిచ్చేది లేదు” అంటూ గ్రామస్తులు ఉద్యమిస్తున్నారు. ఒకప్పుడు ఇండోసోల్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన టీడీపీ (TDP), ఇప్పుడు అదే కంపెనీకి అనుకూలంగా పని చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అటు వైసీపీ (YCP) కూడా కరేడు గ్రామస్థులకు మద్దతు తెలపకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ఇండోసోల్ కంపెనీ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) బినామీ సంస్థగా ఆరోపణలు ఎదుర్కొంది. జగన్ హయాంలో ఈ కంపెనీ ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు, ముఖ్యంగా లోకేశ్ (Nara Lokesh), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) తదితరులు ఇండోసోల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కంపెనీపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే, ఇప్పుడు అదే టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇండోసోల్‌కు భూములు కట్టబెట్టేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇండోసోల్ తో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కయిందనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
ఇండోసోల్ కంపెనీ గతంలో టీడీపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 40 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండోసోల్‌కు రెడ్ కార్పెట్ వేస్తోందని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కంపెనీతో కుమ్మక్కైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కరేడు రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. “ఊరిని చంపి పరిశ్రమ పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు” అని ఆమె హెచ్చరించారు. ఇండోసోల్ జగన్ బినామీ సంస్థ అని ఇప్పటికీ చాలామంది అనుమానిస్తున్నారు. బహుశా అందుకేనేమో కరేడు గ్రామస్తుల ఆందోళనపై వైసీపీ ఎలాంటి స్పందించట్లేదు. దీంతో అధికార, విపక్షాలు ఇండోసోల్‌కు అమ్ముడుపోయాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కరేడు గ్రామం ఉలవపాడు మామిడి ఉత్పత్తికి ప్రసిద్ధి. ఈ గ్రామంలోని రెండు పంటలు పండించే సారవంతమైన భూములున్నాయి. ఇండోసోల్ సోలార్ ప్లాంట్ కోసం 8,500 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 29న భారత చైతన్య యువజన పార్టీ (BCY) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ నేతృత్వంలో వేలాది రైతులు కందుకూరు సమీపంలో 3 కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళన సమయంలో పోలీసులు రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రామచంద్ర యాదవ్ సముద్ర మార్గం ద్వారా కరేడు చేరుకుని నిరసనకు నాయకత్వం వహించారు. కరేడు గ్రామస్తులు తమ భూములను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జాతీయ రహదారి-16ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. గతంలో ఇండోసోల్‌ను విమర్శించిన టీడీపీ ఇప్పుడు దానికి భూములు కట్టబెట్టడం, వైసీపీ నిశ్శబ్దం రాజకీయ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రైతుల ఉద్యమం ఈ వివాదాన్ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి.