Minister Kandula : ఈ నిర్ణయంతో కోనసీమ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా : మంత్రి కందుల
కోనసీమ విశిష్ట సంప్రదాయమైన జగ్గన్నతోట ప్రభల తీర్ధాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) కొనియాడారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు ధన్యవాదాలు తెలిపారు. సచివాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా తెలుగువారి సంస్కృతికి, ఆచారాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో కోనసీమ (Konaseema) ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతుందని, తద్వారా ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కనుమ నాడు ఈ తీర్థం అత్యంత వైభవంగా జరుగుతుందని వివరించారు. కౌశికా నదిలో ప్రభల ఊరేగింపు వంటి అద్భుత దృశ్యాలను చూడటానికి ఏటా సుమారు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని చెప్పారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలు, కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు పొందిన ఈ ఉత్సవానికి, ఇప్పుడు రాష్ట్ర పండగ హోదా రావడం గర్వకారణమని తెలిపారు. ఉత్సవాలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






