Jagan: రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన జగన్ హెలిప్యాడ్ వివాదం..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఈ నెల 3వ తేదీన నెల్లూరు (Nellore) జిల్లా పర్యటనకు రావాల్సి ఉండగా, ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ అనూహ్య నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పార్టీ నేతల ఆరోపణల ప్రకారం, ప్రభుత్వ యంత్రాంగం కావలసిన ఏర్పాట్లు చేయకపోవడం, భద్రత కల్పించకపోవడం వల్లే పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రభుత్వంపై వైసీపీ (YCP) నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ పర్యటనలో ప్రధాన ఉద్దేశ్యం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని (Kakani Govardhan Reddy) పరామర్శించడమే. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాణిని కలుసుకోవాలన్న ఉద్దేశంతో జగన్ ప్రత్యేకంగా గురువారాన్ని ఎంచుకున్నారు. అయితే, ఆయన దిగి వచ్చే హెలీప్యాడ్ విషయమే ఇప్పుడు వివాదంగా మారింది. పోలీసులు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వేదిక నెల్లూరు కేంద్ర కారాగారానికి (Nellore Central Jail) సమీపంలోనే ఉండటం వల్ల, జగన్‌కు ప్రజల మధ్య ప్రయాణించే అవకాశం లేకుండా పోతుందని వైసీపీ భావిస్తోంది. ఇది ఆయన పర్యటనలో రాజకీయ ప్రాభవాన్ని తగ్గించేదిగా భావించి, ర్యాలీగా వెళ్లే వ్యూహం పక్కన పెట్టారట. ఇకపోతే, అధికారులు మాత్రం తమ నిర్ణయం సబబే అంటున్నారు.
వైసీపీ నేతలు సూచించిన సెయింట్ ఆన్స్ స్కూల్ (St. Ann’s School) ప్రాంగణాన్ని హెలిప్యాడ్ కోసం వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది జైలుకు దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దూరాన్ని ర్యాలీగా, ప్రజల మధ్య భారీ కాన్వాయ్‌లో జగన్ ప్రయాణించాలని పార్టీ భావించింది. అయితే పోలీసు శాఖ మాత్రం ర్యాలీలకు అవకాశం ఇవ్వాలనుకోవడం కుదరదని, అది భద్రతా పరంగా సవాలుగా మారుతుందంటూ అభిప్రాయపడుతోంది.
దీనికి సంబంధించి హెలిప్యాడ్ వివాదం న్యాయస్థానానికి కూడా చేరడం గమనార్హం. ప్రభుత్వ యంత్రాంగం హెలిప్యాడ్ ఏర్పాటు విషయంలో తాము ఎలాంటి తప్పూ చేయలేదని చెబుతుండగా, వైసీపీ మాత్రం ప్రజల మధ్యకి వెళ్లే అవకాశాన్ని కావాలనే ఆపుతున్న కుట్రగానే దీనిని చూస్తోంది. ర్యాలీ చేస్తూ జైలుకు చేరాలన్న జగన్ సంకల్పం, పోలీసుల ఆంక్షలు కలిసి ఇప్పుడు పర్యటన పూర్తిగా అనిశ్చితిలో పడేసాయి.