BPCL కోసం ఇండోసోల్ త్యాగం..! తెరవెనుక జరుగుతున్నది ఇదేనా..!?

ఆంధ్రప్రదేశ్‌లో (AP) ఇండోసోల్ సోలార్ కంపెనీకి (Indosol Solar) భూముల కేటాయింపు వ్యవహారం రాజకీయ, సామాజిక వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు (Karedu) గ్రామంలో ఇండోసోల్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు 8,000 ఎకరాల భూమిని కేటాయించేందుకు సిద్ధమవుతోంది. అయితే స్థానిక రైతులు, గ్రామస్థులు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. “చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వబోము” అంటూ గ్రామసభలో తీర్మానించారు. తమ జీవనాధారమైన పచ్చని పొలాలను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వబోమని తేల్చి చెప్తున్నారు. అయితే ఇండోసోల్ కు ఇక్కడే భూములు కేటాయించడం వెనక పలు కారణాలున్నట్టు సమాచారం.
గతంలో ఇండోసోల్ కంపెనీకి నెల్లూరుజిల్లాలోని చేవూరు (chevuru), రావూరు (ravuru) పరిధిలో భూములు కేటాయించింది జగన్ ప్రభుత్వం. అక్కడ కొంతమేర పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే, ఆ భూములను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తమకు కేటాయించాలని కోరింది. BPCL ఈ ప్రాంతంలో రూ.80,000 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ (refinery) ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సీరియస్‌గా పరిగణించింది. BPCL కోసం చేవూరు, రావూరుల్లో ఇండోసోల్ కు కేటాయించిన భూములను ఇచ్చేందుకు అంగీకరించింది. ఇండోసోల్ తో మాట్లాడి అదనపు భూమి ఇస్తామని ఒప్పించింది. దీంతో, ప్రభుత్వం కరేడు ప్రాంతంలో 5,000 ఎకరాలకు మించి 8,000 ఎకరాల భూమిని ఇండోసోల్‌కు కేటాయించేందుకు సిద్ధమైంది.
అటు BPCL, ఇటు ఇండోసోల్‌ను వదులుకోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రెండు కంపెనీలకూ భూములు కేటాయించే ఏర్పాట్లు చేసింది. ఇండోసోల్ సోలార్ ప్యానెళ్ల తయారీ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుతో రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో, BPCL రిఫైనరీ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని భావించి, రెండింటినీ సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండోసోల్ ను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ, ఇప్పుడు ఆ కంపెనీని వెనకేసుకురావడాన్ని టీడీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. అయితే ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఇండోసోల్ లాంటి కంపెనీలను తరిమేస్తే ఇన్వెస్టర్లలో ఆందోళన కలుగుతుందని, పెట్టుబడిదారులెవరూ ముందుకు రారని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే రాజకీయాలను పక్కనపెట్టి ఇండోసోల్ ను ప్రోత్సహిస్తున్నారు. అయితే సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఇండోసోల్ కంపెనీకి అన్ని ఎకరాల భూములు ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. 100-200 ఎకరాల్లో యూనిట్ పెట్టొచ్చని, మ్యాగ్జిమమ్ వెయ్యి ఎకరాలిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. అయితే ప్రాథమికంగా ప్యానల్స్ తయారీ యూనిట్ పెడుతున్న ఇండోసోల్, మున్ముందు ఇక్కడే సోలార్ ప్లాంట్ కూడా పెట్టబోతోందని, అందుకే ఇన్ని ఎకరాల భూములు అవసరమని కొందరు వాదిస్తున్నారు.
అయితే భూకేటాయింపులపై ప్రభుత్వం ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. ఇది విమర్శలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇండోసోల్‌ను షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థగా ఆరోపిస్తూ, దీని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం BPCL, ఇండోసోల్ రెండింటినీ సమన్వయం చేసే క్రమంలో రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండోసోల్, BPCL ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, కరేడు గ్రామస్థుల తిరుగుబాటు సవాలుగా మారింది. రైతుల ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్చలు జరపాలని, పారదర్శకంగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.