Pemmasani Chandrasekhar: ఏపీ కాంట్రాక్టర్స్ కు పెమ్మసాని గుడ్ న్యూస్..

2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అఖండ విజయాన్ని అందుకుంది. ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) మీద అపారమైన నమ్మకంతో ఓట్లుగా మద్దతు తెలిపారు. అయితే ఐదేళ్ళ పాలన అనంతరం 2024లో ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలు ఆశించినది ఏది ఈ పార్టీ నుంచి దక్కలేదు. వైసీపీ వైఖరి వల్ల ఎదురైన సమస్యలలో కాంట్రాక్టర్ల సమస్య కూడా ఒకటి.
తన పాలనలో జగన్ ప్రభుత్వం అనేక అంశాల్లో విమర్శలు ఎదుర్కొంది. కానీ చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లను నిర్లక్ష్యం చేసిన తీరు మాత్రం పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితికి దారి తీసింది. 2019 ముందు టీడీపీ (TDP) హయాంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు ఇవ్వలేదు. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వం వచ్చాకే కొన్ని పనులు చేసిన తమ అనుచరులకూ బిల్లులు క్లియర్ కాలేదు. దీనివల్ల గ్రామస్థాయిలో కూడా పనులు చేసిన వారు ఎన్నో ఆర్థిక కష్టాల్లో పడిపోయారు. వడ్డీలు కట్టలేని పరిస్థితిలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) ఇటీవల చేసిన ప్రకటన కాంట్రాక్టర్లకు ఊరటను అందిస్తోంది. ఆయన ప్రకారం, 2019లో నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం (NREGA) కింద చేసిన పనులకు సంబంధించిన దాదాపు రూ.250–300 కోట్ల బిల్లులను జగన్ ప్రభుత్వ కాలంలో కావాలనే ఆపేశారని తెలిపారు. పనులు చేసినా, దాన్ని తిరస్కరించినట్టు వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి శాఖ (Rural Development Department) మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నాయి. క్రమంగా అన్ని పెండింగ్ పనులను తిరిగి ఓపెన్ చేసి వాటిపై చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.180 కోట్లు కేంద్రం విడుదల చేయగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం జత చేసి, 30 రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే ఉన్న 4.3 లక్షల పెండింగ్ బిల్లుల్లో, సాంకేతిక సమస్యల వల్ల సుమారు 60–70 వేల పనులపై క్లారిటీ రాలేదన్నా, మిగిలిన 3.5 లక్షల పనులకు బిల్లులు మంజూరు చేయబోతున్నారని వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా దేశంలో చిన్న స్థాయిలో పని చేసిన అనేక మంది కాంట్రాక్టర్లు, ముఖ్యంగా 5 నుంచి 15 లక్షల వరకు బిల్లులు ఉన్న వారు, మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం పొందనున్నారు.