NDA Alliance: అసెంబ్లీ వ్యాఖ్యల నుంచి లీగల్ నోటీసుల వరకూ – కూటమి ప్రభుత్వానికి కొత్త సవాళ్లు..

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూటమి ప్రభుత్వానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం మీద నేరుగా విమర్శలు చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ ఈ సారి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యనేత మీద తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే బహిరంగంగా అసెంబ్లీలో విమర్శించడం, అలాగే ఒక పోలీసు అధికారి ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపించడం చర్చనీయాంశమయ్యాయి.
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ (Bonda Uma) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ, పీసీబీ (PCB)లో ఏ పని చెప్పినా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తావన వస్తుందని బహిరంగంగా ప్రకటించారు. పనిని పనిలా చూసే పవన్ కళ్యాణ్‌కు ఈ ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, పీసీబీ చైర్మన్‌గా ఉన్న సీనియర్ అధికారి కూడా క్లీన్ ఇమేజ్ కలిగి ఉండగా, ఆయనపై విమర్శలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే సమయంలో కర్నూలు (Kurnool) రేంజ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ శంకరయ్య (C.I Shankaraiya) పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆయన గతంలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్య కేసులో చేసిన వాంగ్మూలాలు, తర్వాత వెనక్కి తగ్గిన తీరు చాలా సందేహాలు రేకెత్తించాయి. మొదట్లో తనను బెదిరించారని, డెడ్ బాడీని పోస్టుమార్టం కి పంపొద్దని ఒత్తిడి చేశారని చెప్పినా, కోర్టు ముందు మాత్రం ఈ విషయాలు చెప్పలేదు. ఈ అంశం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.
ఇక ఇప్పుడు అదే శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు నోటీసులు పంపి బహిరంగ క్షమాపణలు కోరడం, పరువు నష్టం పరిహారం డిమాండ్ చేయడం పెద్ద సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆయనపై ఉన్న సస్పెన్షన్ గత ప్రభుత్వం తొలగించటం, ఆ తర్వాత కీలక పదవుల్లో అవకాశం రావటం అన్నివేళల్లో ఆయన స్థానం వివాదాస్పదంగానే నిలిచింది.
ఈ రెండు సంఘటనలు కూటమి ప్రభుత్వ తీరుపై చర్చకు దారి తీస్తున్నాయి. ఒకవైపు తమ పార్టీలోని ఎమ్మెల్యేలు బహిరంగంగా అసెంబ్లీలో విమర్శలు చేయడం, మరోవైపు అధికారులు కూడా నోటీసులు పంపించడం సర్కారు ప్రతిష్టను దెబ్బతీయగల అంశాలుగా మారాయి. సాధారణంగా అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితులు రాకూడదు కానీ, ఇప్పుడు అవి వరుసగా చోటుచేసుకోవడం కూటమి బలహీనతగా అభివర్ణిస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుల మాటల్లో, మెతకదనమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. గతంలో వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులకు ముఖ్య పదవులు ఇచ్చిన విధానం, తరువాత వెనక్కి తగ్గిన తీరు, ఇప్పుడు బయటపడుతున్న పరిణామాలకు మూలం అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ పరిణామాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత కానుంది.