Vivekananda Reddy: ఆరేళ్లు గడిచినా.. వివేకా కేసు విచారణ ఎందుకు ముందుకెళ్లడం లేదు?

తెలుగు రాష్ట్రాల్లో అనేక మలుపులు తిరిగిన, దాదాపు ఆరున్నరేళ్లుగా ఇంకా పూర్తిస్థాయి విచారణ దశకు కూడా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Y. S. Vivekananda Reddy) హత్యకేసు. 2024 ఎన్నికల సమయంలో చాలా వైరల్ గా మారిన ఈ కేస్ ఇప్పుడు తిరిగి మళ్ళీ సంవత్సరం తర్వాత సంచలనంగా మారింది. 2019లో ఈ హత్య జరిగినప్పటికి, ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్న భావన ప్రజల్లో ఉంది. విచారణ ఇంకా పూర్తికాకపోవడం, అసలు నిందితులు ఎవరో స్పష్టత లేకపోవడం చాలా మంది ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివేకా కుమార్తె వైఎస్ సునీత (Y. S. Sunitha) చాలా కాలంగా కోర్టుల్లో న్యాయపోరాటం జరిపారు. చివరకు సుప్రీంకోర్టులో (Supreme Court) కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో కేసు ముగింపుకు చేరుకుంటుందేమో అనే అంచనాలు వచ్చాయి. కానీ ఇప్పటికీ దర్యాప్తు అంతంత మాత్రంగానే ఉండటంతో, నిందితుల వెనుక ఎవరో బలమైన వ్యక్తులు ఉన్నారు అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఈ కేసుపై దృష్టిని మరల్చాయి. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హత్య జరగగా, ఎన్నికల సమయం కావడంతో కేసు మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) సర్కార్ హయాంలో అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కేసు పరిష్కారానికి మార్గం సులభతరం అవుతుందేమో ఆశలు మొదలయ్యాయి. కేసు ప్రస్తుతం సీబీఐ (CBI) దర్యాప్తులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో సీబీఐకి సహకారం తక్కువగా ఉండడంతో ముందడుగు పడలేకపోయారు. ఇప్పుడైతే కేంద్రంలో ఉన్న బీజేపీకి (BJP) టీడీపీ (TDP) మద్దతు ఉండటంతో కేసు దర్యాప్తులో వేగం వచ్చే అవకాశం ఉంది. అయినా ఇప్పటిదాకా గణనీయమైన పురోగతి కనిపించకపోవడం గమనార్హం.
చంద్రబాబు తరచూ ఈ హత్య కేసును తన సభల్లో ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల కేసు పరిష్కారానికి పరోక్షంగా ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ రాజకీయంగా తిరిగి బలంగా నిలవకుండా చేయాలన్న వ్యూహంలో భాగంగా ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ కేసు విషయం ఎప్పుడూ ఒక కొలిక్కి వస్తుంది అన్నది భేతాళ ప్రశ్నగా మారుతుంది. ఈసారి అయినా వివేకా హత్యకేసుకు పూర్తి విచారణ జరిగి నిజమైన నిందితులు శిక్షించబడతారా? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.