Pawan Kalyan: పార్టీలో క్రమశిక్షణే ప్రాధాన్యం.. లేనివారికి నో ప్లేస్ అంటున్న పవన్..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన పార్టీ అయిన జనసేనలో క్రమశిక్షణను కచ్చితంగా పాటిస్తున్నారు. నాయకులు పార్టీ పరిమితులు దాటి మాట్లాడిన లేక ప్రవర్తించినా వారిపై ఆయన తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో పార్టీలోని కొంతమంది స్థానిక స్థాయి నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల, ఆ నేతలను పవన్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. పార్టీకి ప్రతిష్ఠ తీసుకురాని, సాంఘికంగా వ్యతిరేకత కలిగించే కార్యకలాపాలకు ఆయన క్షమించని ధోరణిని అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ సందర్భంగా పవన్‌ను ఇదే విషయం కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆయన శాంతంగా స్పందించారు. పార్టీ పరిపాలనకు నిబద్ధత అవసరం అని, ప్రతి ఒక్కరూ తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే పార్టీ విలువలు నాశనమవుతాయని స్పష్టం చేశారు. “ప్రతి నాయకుడూ నియమాలకు లోబడి ఉండాలి. అది కాదని అనుకుంటే, నేను పార్టీని కొనసాగించాల్సిన అవసరం లేదు,” అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా తమ దారి మార్చుకోకపోతే, ఎలాంటి ఆలస్యం లేకుండా వారిని బహిష్కరించడంలో వెనుకాడేది లేదని.. అది అందరికీ వర్తిస్తుందని.. తన దృష్టిలో తన పార్టీలో ఉన్న అందరూ సమానమని ఆయన తెలిపారు.
విజయవాడ (Vijayawada) లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయనను డిప్యూటీ సీఎంగా సంతృప్తిగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు. “మౌనం చాలాసార్లు అనేక అనుమానాలకు తావిస్తుంది. కానీ అవసరమైతే నేను మాట్లాడతాను. నేను ప్రభుత్వం భాగంగా ఉండటంలో పూర్తిగా తృప్తిగా ఉన్నాను,” అని స్పష్టం చేశారు.
మరోవైపు, జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) గతంలో ముఖ్యమంత్రిగా చేసిన పాలనపై ఆయన విమర్శలు కొనసాగిస్తున్నారు. “ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో జీవిస్తున్నామో ఆయన ఇంకా అర్థం చేసుకోలేదు. ప్రజలపై అక్రమంగా దాడులు చేస్తే, వారు మౌనంగా తట్టుకుంటారని ఎలా అనుకుంటారు?” అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో నియమాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూసే నాయకుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం, ప్రభుత్వంలో తన పాత్ర పట్ల స్పష్టత చూపడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నట్టు కనిపిస్తోంది.