ఆంధ్రప్రదేశ్ లో రూ.1000 కోట్ల పెట్టుబడితో డైకిన్ యూనిట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జపాన్ ముందుకొచ్చింది. జపాన్‌కు చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో ఎయిర్ కండిషనింగ్, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించింది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని పారిశ్రామికవాడ శ్రీసిటీలో 75.5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు అక్కడ భూమి కొనుగోలుకు సంబంధించిన రెండిరటి మధ్య ఒప్పందం కుదిరినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీసిటీలో జరిగిన కార్యక్రమంలో డైకిన్ ఇండియా ఎండీ, సీఈఓ కన్వల్జీత్ జావాతో పాటు శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.






