Chandrababu: ఇప్పుడు అక్కడ సాధ్యమైనట్లే .. రేపు ఏపీలోనూ : చంద్రబాబు
ముప్పై ఏళ్ల కిందట నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ( ఐటీ) వినియోగం గురించి చెబితే హేళనగా మాట్లాడారు. టెక్నాలజీతో హైదరాబాద్ (Hyderabad) ఎదుగుదల ఎలా సాధ్యమైందో, భవిష్యత్తులోఆంధ్రప్రదేశ్ లో ఇంటికో పారిశ్రామికవేత్త అనే మా ఆలోచన కూడా అలాగే సాకారమవుతుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈ సంస్థలు, మెగా పారిశ్రామిక పార్కులకు సీఎం వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రజావేదికలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు అవకాశాలను అందిపుచ్చుకుని ఎదగాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు (MSME Parks) ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. ఏడో తరగతి చదువుతున్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరినీ ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలనుకుంటున్నాం. వారు ఎదిగే సమయానికి స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది మా లక్ష్యం, నాడు ప్రతి కుటుంబం నుంచి ఐటీ (IT) చదివేవారు ఉండాలనే లక్ష్యంతో ఇంజినీరింగ్ కళాశాలలు అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో అమెరికా, లండన్ ఆస్ట్రేలియాల్లో అత్యధిక వేతనాలు తీసుకునేవారిలో తెలుగువారే ముందున్నారని గర్వంగా చెబుతున్నా. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీతో అమెరికా, జపాన్ సరసన మనం నిలుస్తాం అని అన్నారు.







