Chandrababu: వివేకా హత్య కేసు.. చంద్రబాబును తప్పుదోవ పట్టించారా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) ఒక సంచలనాత్మక అంశంగా మారిన విషయం తెలిసిందే. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో దివంగత మాజీ ఎంపీ, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసు గురించి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పలు సందర్భాల్లో ప్రస్తావించడం, ఈ హత్య వెనుక రాజకీయ కుట్రలు, తనపై చేసిన ఆరోపణలు, ఇంటెలిజెన్స్ వైఫల్యం లాంటి అంశాలపై మాట్లాడుతున్నారు. ఈ కేసును సరిగా డీల్ చేయలేకపోవడం వల్లే 2019లో అధికారానికి దూరమయ్యే భావనలో ఆయనలో ఉన్నట్టు అర్థమవుతోంది.
వై.ఎస్. వివేకానంద రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి (YSR) సోదరుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి (YS Jagan) బాబాయి. 2019 ఎన్నికలకు కొద్ది వారాల ముందు జరిగిన ఈ హత్య రాజకీయ దుమారం రేపింది. మొదట వివేకా మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల అనుమానాలు, ఫోరెన్సిక్ నివేదికలు, రక్తపు మరకలు, గాయాల ఆధారంగా ఇది హత్యగా నిర్ధారణ అయింది. ఈ కేసు తొలుత రాష్ట్ర పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)కి అప్పగించబడినప్పటికీ, రాజకీయ జోక్యం ఆరోపణలతో 2020లో సీబీఐకి బదిలీ అయింది.
చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పగానే తాను కూడా నమ్మినట్లు చంద్రబాబు ఇటీవల వెల్లడించారు. సొంత కుటుంబసభ్యులను దారుణంగా హత్య చేసి ఇలా గుండెపోటుగా చిత్రీకరించి నమ్మించే వాళ్లు ఇప్పుడు రాజకీయ నేతలుగా తయారయ్యారని ఆయన పరోక్షంగా జగన్ ను ప్రస్తావిస్తున్నారు. అలాంటి వాళ్లతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించలేకపోయిందని, తాను కూడా అప్రమత్తంగా ఉండలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెంది ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ అప్పుడే ఈ కేసును సమర్థవంతంగా నిర్వహించి, నిందితులను జైలుకు పంపి ఉంటే, రాజకీయ పరిస్థితి వేరేలా ఉండేదని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ కేసును అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సరిగా డీల్ చేయలేదని చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసును సమర్థవంతంగా డీల్ చేయడంలో ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందని ఆయన భావిస్తున్నారు. బహుశా ఈ కారణంగానే చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వర రావుకు కీలక బాధ్యతలు అప్పగించి ఉండకపోవచ్చని అర్థమవుతోంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ కేసును సరిగా పరిశీలించి ఉంటే, హత్య వెనుక ఉన్న నిజాలు ముందుగానే బయటపడి ఉండేవని, అది రాజకీయంగా టీడీపీకి లాభించి ఉండేదని బహుశా చంద్రబాబు అభిప్రాయపడుతూ ఉండొచ్చు.
వివేకా హత్య కేసు సీబీఐకి బదిలీ కావడం, దర్యాప్తులో ఆలస్యం, ఆరోపణలు, కౌంటర్ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసాయి. సీబీఐ 2021లో నలుగురు నిందితులను (యెర్ర గంగిరెడ్డి, వై. సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తాగిరి) గుర్తించి చార్జిషీట్ దాఖలు చేసింది. షేక్ దస్తాగిరి అప్రూవర్‌గా మారడం, వై.ఎస్.భాస్కర్ రెడ్డి అరెస్ట్, వై.ఎస్. అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు వంటి పరిణామాలు కేసును మరింత సంక్లిష్టం చేశాయి.
అయితే ఈ హత్య వెనుక చంద్రబాబు ఉన్నారంటూ అప్పట్లో వైసీపీ ఆరోపించింది. నరకాసుర రక్త చరిత్ర పేరుతో కథనాలు కూడా ప్రచురించింది. దీనిపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నాటకీయంగా తనపై ఆరోపణలు చేశారని, సాంకేతికత సాయంతో నిజాలు బయటకు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పట్లో కేసును సీబీఐకి అప్పగించకుండా సమర్థవంతంగా నిర్వహించి ఉంటే, టీడీపీకి రాజకీయంగా కీలకమైన అస్త్రంగా మారి ఉండేదని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు.