Banakacherla Project: బనకచర్లపై సీఎం చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు.. ఈమెయిల్ కుట్రపై కేంద్రానికి లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎప్పుడైనా ఓ ప్రాజెక్టును ప్రారంభించే ముందు పూర్తి స్థాయిలో పరిశీలనలు చేసి, అనేక కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. గతంలో అమరావతి (Amaravati) రాజధాని విషయంలో ఆయన చూపిన చొరవ ఇదే విషయాన్ని నిరూపిస్తుంది. ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రజలను ఒప్పించి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఇప్పుడు చంద్రబాబు కర్నూలు (Kurnool) జిల్లాలో రూపొందించిన ‘బనకచర్ల (Banakacherla) బహుళార్థ సాధక ప్రాజెక్టు’పై దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలుస్తున్న గోదావరి (Godavari) జలాలను వినియోగించేందుకు యోచించారు. ఈ ప్రణాళికను రూపొందించేందుకు అనేక జలవనరుల నిపుణులను సంప్రదించి, నివేదికలు సేకరించారు. జలవివాదాల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ (Ministry of Environment) అనుమతి పొందేందుకు చర్యలు తీసుకున్నారు.
ఇలాంటి సమయంలో కేంద్రం నుండి ప్రాజెక్టును తిరస్కరించారని సమాచారం వచ్చింది. వందల సంఖ్యలో ఈ-మెయిళ్లు తమకు అందాయని, వాటిలో బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అందులో రాజకీయపరమైన మాయాజాలం దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందరి దృష్టి తెలంగాణ (Telangana) వైపుకే వెళ్ళింది, ఎందుకంటే అక్కడి ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ద్వారా కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ మెయిల్ వ్యూహం అవసరం లేకుండా నేరుగా నివేదికలు పంపినట్టు తెలుస్తోంది.
ఇలాంటి పరిణామాలు చూసిన చంద్రబాబు గతంలో అమరావతిపై జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు ప్రపంచ బ్యాంకు (World Bank) సహాయం నిలిపివేయడానికి ప్రయత్నించారు.. ఇప్పుడు అదే తరహాలో బనకచర్ల ప్రాజెక్టును కూడా అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందా? అన్న సందేహం ఆయనకు కలిగింది.
దీనిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన, కేంద్ర అధికారులకు లేఖ రాసి ఈ-మెయిళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని కోరనున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది నిజమైతే నెక్స్ట్ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..కేంద్రం బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.