Chandrababu: టీడీపీ మంత్రులను వణికిస్తున్న చంద్రబాబు..?

2014 నుంచి 2019 వరకు టిడిపి(TDP) మంత్రుల విషయంలో తీవ్ర విమర్శలు ఉండేవి. పార్టీ కార్యకర్తలే ఎన్నో సందర్భాల్లో మంత్రుల విషయంలో ఆరోపణలు చేశారు. ఓవైపు వైసీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తుంటే, టిడిపి మంత్రులు సోషల్ మీడియాలో వెనుకబడ్డారని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి ఇదే ప్రధాన కారణమని టిడిపి కార్యకర్తలు భావిస్తూ ఉంటారు. ఇక 2024లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే కాకుండా విపక్షాలు చేసే విమర్శలను తిప్పి కొట్టాలని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పార్టీ మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రులను సోషల్ మీడియా ఇబ్బంది పెట్టేస్తోంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాను తక్కువ అంచనా వేసిన మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న క్లాసులు అన్ని ఇన్ని కాదు. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన మంత్రులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే చంద్రబాబు క్యాబినెట్ సమావేశాలు అనంతరం వారికి స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వైసీపీ పై విమర్శలు చేయని వారికి ఘాటుగానే వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో మంత్రులు సోషల్ మీడియా విషయంలో అప్రమత్తమై ఎప్పటికప్పుడు కొత్త టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన మంత్రులు తమ సోషల్ మీడియాను బలోపేతం చేసుకునేందుకు భారీగానే ఖర్చు పెడుతున్నారు. పోస్టులు, చిన్న చిన్న వీడియోలు అలాగే డిఫరెంట్ కంటెంట్ తో కాస్త మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు.
సోషల్ మీడియా పై అవగాహన లేని పలువురు మంత్రులు ప్రత్యేకంగా అవగాహన ఉన్నవారితో క్లాసులు కూడా చెప్పించుకుంటున్నారు. గతంలో మీడియా ముందు కనపడడానికి మంత్రులు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితుల మారడంతో సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి సారించారు. క్యాబినెట్ సమావేశం వస్తుందంటే చాలు మంత్రుల్లో సోషల్ మీడియా టెన్షన్ పెరిగిపోతుంది. ఏ అంశాల్లో చంద్రబాబు క్లాస్ తీసుకుంటారో అనే భయం వెంటాడుతోంది.