Chandrababu: చంద్రబాబు ఢిల్లీ టూర్, మోడీతో కూడా భేటీ..?

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ప్రతీసారి ఏదొకటి సాధించుకు వస్తున్న చంద్రబాబు నాయుడు.. ఈసారి ఢిల్లీ పర్యటనలో కూడా అదే దిశగా అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. 15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్న ముఖ్యమంత్రి.. ప్రధాని నరేంద్ర మోడి(Narendra Modi)ని సైతం కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రాజెక్ట్ లు, నిధులపై వారితో చర్చించే అవకాశం ఉంది.
మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్ లో చంద్రబాబు పాల్గొంటారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah), ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తదితరులతో ఆయన భేటీ కానున్నట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
వీటితో పాటుగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనులపై కూడా ఈ పర్యటనలో చర్చించనున్నారు. 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు, అదే రోజు మధ్యాహ్నం అమిత్ షాతో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం సాయంత్రం 4.30 గంటలకు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతో భేటీ అయి.. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ గురించి చర్చించనున్నారు.
16వ తేదీన కూడా సిఎం ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో.. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనాపై చర్చిస్తారు. ఆ తర్వాత ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో అమరావతి నిధులపై చర్చించే అవకాశం ఉంది. అదే రోజు కుదిరితే ప్రధాని మోడితో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి అమరావతి చేరుకోనున్నారు సిఎం.