Chandrababu: ఆవకాయ్-అమరావతి ఫెస్టివల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని క్రియేటివ్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ను టూరిజం డెస్టినేషన్ గా మారుస్తామని స్పష్టం చేశారు. అలాగే తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటమే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. విజయవాడ పున్నమీ ఘాట్ లో నిర్వహించిన అవకాయ్- అమరావతి ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం.. యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీతో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. ఇరువురూ కలిసి కృష్ణాహారతిని తిలకించారు. అంతకుముందు కృష్ణా నదిలో హౌస్ బోట్ ను ప్రారంభించారు. తెలుగు సంస్కృతికి, ఆతిథ్యానికి ఆవకాయ్ ప్రతిరూపమని సీఎం అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ..“ఆవకాయ్ అనగానే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, మన సంప్రదాయం సాంస్కృతిక వైభవానికి చిహ్నం. ఆహారం అంటే ఇండియా, ఇండియాలో కమ్మనైన ఆహారం అంటే ఆంధ్రా వంటకాలు అనేలా మనం గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉండటం మన ప్రత్యేకత. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆవకాయ ఉత్సవాలు జరుగుతున్నాయి. కృష్ణా నదీతీరం ఓ వైపు కనకదుర్గ ఆలయ ఆధ్యాత్మిక వైభవం మరోవైపు ఉంది. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఆవకాయ ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నాం. నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగ, గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ఇలా వరుస సంబరాలు జరుగుతున్నాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. తెలుగు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రపంచానికి ఆతిధ్యమిచ్చే పరిస్థితి మన ఏపీకి వస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
గత పాలనలో పండుగలు లేవు ఉత్సవాలు లేవు. అసలు హాయిగా స్వేచ్ఛగా నవ్వుకున్న సందర్భమూ లేదు. కూటమి వచ్చాకే విజయవాడ దసరా ఉత్సవాలు జరిగాయి. దసరా అంటే గతంలో మైసూర్, కలకత్తా మాత్రమే గుర్తొచ్చేవి, ఇప్పుడు విజయవాడ పేరు కూడా గుర్తొచ్చేలా చేశారు. ఒక్కో రాష్ట్రానికి ఒక సంస్కృతి ఉంటుంది. తమిళనాడులో జల్లికట్టు ఉంటుంది. చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టు జరుపుకుంటారు. ఆచారాలను, సంస్కృతిని కాపాడుకోవాలి. వాటిని మర్చిపోతే మన చరిత్ర మనమే మర్చిపోయినట్లు అవుతుంది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలనే బాధ్యతతో ఇవన్నీ చేపడుతున్నాం. అని అన్నారు.
ఆవిష్కరణల చిరునామా తెలుగు సినిమా
“ఈ ఉత్సవ్ లో భాగంగా సంస్కృతీ, సాహిత్యం, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే కృష్ణా, గోదావరి పుష్కరాలు రావటం నా అదృష్టం. ప్రకృతిని, నదులను పూజిస్తాం కాబట్టే 12 ఏళ్ల క్రితం కృష్ణమ్మకు హారతి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ వల్ల ఈ ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండి అన్ని విధాలా అభివృద్ధి జరిగింది.తెలుగుకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అంతా కలిసి మెలసి ఉండటం మన సంస్కృతిలో భాగం. తెలుగు జాతి అంటేనే ఆతిథ్యం, మంచితనం, నైపుణ్యం, విలువలు, సామర్ధ్యం. అందుకే తెలుగువారు ఎక్కడున్నా నెంబర్ వన్.
ఆంధ్రాప్రెన్యూర్స్ గా ఈ ప్రాంతం వాళ్లు మంచి పేరు తెచ్చుకున్నారు. క్రియేటివ్ నెస్ కు చిరునామాగా తెలుగు సినిమా ఉంది. భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకూ విజయాలు సాధించారు. తెలుగు వారు ఉన్నంత వరకూ వారి గుండెల్లో ఎన్టీఆర్ ఉంటారు. ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలయ్య లాంటి వారు ఎందరో నటులు ఈ ప్రాంతం వారే. బాలివుడ్, కోలివుడ్, హాలివుడ్ ఇలా ఎన్ని ఏమున్నా తెలుగు హీరోలు ప్రత్యేకమే. సినిమాలకు మనవాళ్లు వన్నె తెచ్చారు. సంస్కృతి, సాహిత్యం సినిమా తెలుగు ప్రజల బలం” అని అన్నారు.
మరో గోవాగా సూర్యలంక బీచ్
“రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో 50 వేల నుంచి 1 లక్ష గదులను పర్యాటక రంగానికి అందుబాటులోకి తీసుకువస్తాం. త్వరలోనే గోవా బీచ్ తరహాలో సూర్యలంక బీచ్ ప్రాచుర్యం పొందుతుంది. పోలవరంలో పాపికొండలు, ఫ్లెమింగో ఉత్సవాలు, గండికోట, అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతాం. 9 జిల్లాల్లో ‘ఏపీ ట్రావెల్ మార్ట్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. అమరావతికి అపజయం అనే మాటే లేదు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి పట్టణాలు అమరావతిలో భాగమై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, డైనమిక్ గ్రీన్ ఫీల్డ్ సిటీగా అవతరిస్తుంది. పర్యాటకులు రావాలంటే భద్రత, శుభ్రత ముఖ్యం. ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటాం. దేశంలో వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక వెల్లడించింది. పీపీపీ విధానంలో కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల్లో 30 శాతం మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. ఆంధ్రాప్రెన్యూర్స్ ప్రపంచవ్యాప్తంగా తమ నైపుణ్యాన్ని చాటుతున్నారు. దసరా ఉత్సవాలను మైసూర్, కలకత్తా స్థాయిలో విజయవాడలో నిర్వహించగలిగాం. సంక్రాంతి పండుగ వేళ అందరూ తమ సొంత ఊళ్లకు వెళ్లి, జన్మభూమితో మమేకం కావాలని” ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
పెట్టుబడుల్లో, అభివృద్ధిలో ఏపీ లీడ్- ఈయూ రాయబారి హెర్వె డెల్ఫీ
విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించటంలోనూ, అభివృద్ధి, నైపుణ్యం, వ్యవసాయంలో ఏపీ దేశంలో ఓ కీలక రాష్ట్రంగా ఉందని యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వె డెల్ఫీ అన్నారు. ఆవకాయ్ ఫెస్టివల్ లో సీఎం తో కలిసి పాల్గోన్న ఆయన తెలుగు సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాలు సృష్టించిన ప్రాభవం అద్వితీయం అన్నారు. రాజమౌళి తీసిన సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను చూశానని తెలిపారు. నాటు నాటు పాట తనను ఎంతో ఆకర్షించిందని తెలిపారు. ఏపీకి చెందిన కూచిపూడి, కలంకారి, కొండపల్లి బొమ్మలు ప్రపంచాన్ని ఎప్పుడో ఆకర్షించాయని అన్నారు. కళలు, సినిమా, సాహిత్యం, సంగీతం వివిధ సమాజాలను దగ్గర చేస్తాయని స్పష్టం చేశారు. ఈయూ ఫిలిం ఫెస్టివల్ త్వరలో ఆంధ్రప్రదేశ్ లోనూ నిర్వహించేందుకు ఆలోచన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.






