Blue Book: నిన్నటి వరకు రెడ్..ఇప్పుడు బ్లూ.. ఆంధ్రాలో పెరుగుతున్న బుకిష్ రాజకీయాలు..

ఏపీ (Andhra Pradesh) రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. పాలన కన్నా ఇప్పుడు పుస్తకాలు రాయడమే మిన్నగా కనిపిస్తోంది. ఒకప్పుడు పాలకులు దేశ రాజ్యాంగాన్ని (Constitution of India) పాటిస్తూ పరిపాలన సాగించాల్సిన అవసరం ఉందని గొప్పగా మాట్లాడే వారు, ఇప్పుడు మాత్రం తమ తమ పార్టీ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు తయారుచేస్తూ, వాటి ఆధారంగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తుండటం గమనార్హం.
టీడీపీ (TDP ) నేత నారా లోకేష్ (Nara Lokesh), గతంలో వైసీపీ (YSRCP ) హయాంలో జరిగిన ఘటనలను, తమ పార్టీ నేతలు ఎదుర్కొన్న అన్యాయాలను ఎత్తిచూపేందుకు ‘రెడ్ బుక్’ (Red Book) అనే పేరుతో ఓ డాక్యుమెంటేషన్ మొదలుపెట్టారు. వైసీపీ పాలనా సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎదుర్కొన్న ప్రతి అరాచకానికి సంబంధించిన రికార్డు తమ వద్ద ఉందని చెప్పడం ద్వారా, అధికారంలోకి వచ్చినప్పుడు తమ చర్యలకు న్యాయసమ్మతత చూపాలన్న ఆలోచన కనిపించింది. తాజాగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో, వైసీపీ దీని మీద తిరగబడ్డింది. రెడ్ బుక్ ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమాలు చేస్తారని వారు విమర్శలు చేయడం బాగా కామన్ అయ్యింది.
వీటిపై టీడీపీ బలమైన స్పందన ఇచ్చినప్పటికీ, ఆసక్తికరంగా మారిన మరో విషయం ఏమిటంటే, నిన్న మొన్నటి వరకు రెడ్ బుక్ గురించి విమర్శించిన వైసీపీ తన స్టైల్‌లో మరో బుక్కును స్టార్ట్ చేస్తోంది. వారి నేతలు ఇప్పుడు ‘బ్లూ బుక్’ (Blue Book) అనే పేరుతో తమపై జరిగిన దాడులు, అన్యాయాలపై సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల తర్వాత అనేక నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా రాసుకుంటూ, డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారట. పాలక పార్టీ తప్పులు ఎక్కడయితే జరిగినాయో అవి రికార్డ్ అవుతూ పోతున్నాయని చెబుతున్నారు. ఈ బ్లూ బుక్‌లు కూడా కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో తమకు అవకాశమొస్తే దానికి తగిన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడతామన్న సంకేతాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా నేతలు తమ వంతుగా డాక్యుమెంటేషన్ చేస్తుండటంతో, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే విశ్లేషకులు (analysts) మాత్రం చెబుతున్నదేమిటంటే, చట్టాలు (laws) ఉండగానే అవినీతి చేసిన వారిని శిక్షించడానికి ప్రత్యేక పుస్తకాలు అవసరమా? ఇదిలా సాగితే పాలన కంటే పుస్తకాలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి (democracy) మంచి సూచిక కాదని హెచ్చరిస్తున్నారు. ఒక్క రోజు ఒక పార్టీ, మరొక రోజు ఇంకొక పార్టీ ఇలా బుక్స్ రాస్తూ ఉండటం వల్ల ప్రజలకు మేలు చేయడం కంటే కూడా పార్టీలు పరస్పరం కక్ష సాధింపు చర్యలపైన ఎక్కువ ధ్యాస పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా రాజకీయ పార్టీలు ఇటువంటి పుస్తకాలను ఎంకరేజ్ చేయకపోవడం మంచిదని అందరూ భావిస్తున్నారు.