Jagan: అరెస్ట్ ఊహాగానాల మధ్య జగన్ లేటెస్ట్ స్ట్రాటజీ..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు వేగంగా పాకుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీ అనుకూల మీడియా వర్గాలు కూడా తుది సమయం, ప్రదేశం అన్నీ డిసైడ్ అయినట్లుగా ఊహాగానాలు మొదలుపెట్టాయి. గతంలో నంద్యాల (Nandyal) నుంచి విజయవాడ (Vijayawada) వరకు నారా చంద్రబాబు నాయుడును (N. Chandrababu Naidu) రోడ్డు మార్గంలో తీసుకువచ్చిన ఘటనను గుర్తు చేస్తూ, ఇప్పుడు జగన్‌ను బెంగళూరు (Bengaluru) నుంచి అదే తరహాలో తరలించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఇలా గతంలో జరిగిన బాబు అరెస్ట్ పరిణామం, ఇప్పుడు జరుగుతుందేమోనన్న జగన్ అరెస్ట్ చర్చలు ఒకదానికొకటి లింక్ చేస్తూ వార్తలు వెల్లివిరుస్తున్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కాం (Liquor Scam) అంశంలో జగన్ అరెస్ట్ తప్పదన్న ముద్రను కొంతమంది మీడియా సంస్థలు వేయడానికి యత్నిస్తున్నాయి. అయినా కూడా ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ స్పష్టత లేదు. అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన నేత విషయంలో ఏదైనా చర్య జరిగితే అది సాధారణం కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ అంశం చుట్టూ రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది.
ఇదే సమయంలో జగన్ గత అనుభవాన్ని గుర్తు చేస్తూ ఆయనకు ఇది తొలి అరెస్ట్ కాదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో 16 నెలల పాటు ఆయన జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారు. అప్పట్లో చూపిన ధైర్యాన్ని ఇప్పుడు కూడా ప్రదర్శిస్తూ, ముందుగానే పార్టీని గట్టిగా నిర్మించడంపైనే దృష్టిపెడుతున్నారని అంటున్నారు. ఇటీవల తాడేపల్లి (Tadepalli) కార్యాలయంలో వరుసగా సమావేశాలు జరుపుతూ, స్థానిక నాయకులతో సమాలోచనలు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలను జిల్లాల నాయకులకే అప్పగిస్తూ, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రతి జిల్లా అధ్యక్షుడు తమ పరిధిలో ఏదైనా కార్యాచరణ, నిరసన చేపట్టాలంటే స్వేచ్ఛగా నిర్ణయించుకునే విధంగా అధికారాలు ఇచ్చినట్టు సమాచారం. జగన్ అరెస్ట్ జరిగితే, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ యాక్టివ్ అయ్యేలా ఇప్పటికే పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ శ్రేణుల నిర్మాణం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బలంగా ఉన్నందున, ఎలాంటి రాజకీయ సంక్షోభమైనా తట్టుకునే స్థితిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక ఇంచార్జిలు నియమించడం, అలాగే మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ బేస్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చర్యలన్నీ పార్టీని మరింత సమర్థంగా మార్చే దిశగా ఉన్నాయని, రాబోయే రాజకీయ పరిణామాలకు ఎదురు నిలవడానికే ఈ ఏర్పాట్లు అన్న భావన గట్టిగా వ్యక్తమవుతోంది.