TDP Tholi Adugu: తొలి అడుగుతో టీడీపీ టార్గెట్ రీచ్ అవుతుందా..!?

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఐదేళ్ల పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా కేడర్ మొత్తం నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లాలని ఆదేశించింది. ప్రజలతో నేరుగా సంప్రదించి, ప్రభుత్వ విజయవాలను వివరిస్తుంది. టీడీపీకి రాజకీయంగా, సంస్థాగతంగా మరింత బలపడేందుకు, ప్రజలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఒక కీలక అడుగుగా భావిస్తోంది.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి నేపథ్యంలో, పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) గత పొరపాట్లను పునరావృతం కాకూడదని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కేడర్‌ను విస్మరించి.. అధికారులు, వాలంటీర్లపై ఆధారపడటం వల్ల ఓటమి పాలైందని వైసీపీ స్వయంగా ఒప్పుకుంది. ఈ పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేడర్ నిరంతరం ప్రజల మధ్య యాక్టివ్‌గా ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా టీడీపీ కేడర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లను పెంచడం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, 20 లక్షల ఉద్యోగ అవకాశాల సృష్టి వంటి విజయాలను హైలైట్ చేస్తారు. అదే సమయంలో, వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక, పాలనపరమైన విధ్వంసాలను ప్రజలకు గుర్తు చేస్తారు. అంతేకాక, ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. వాళ్లు ఇంకా ఆశిస్తున్నారో సేకరిస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రజా స్పందనను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఏడాది పాలనలోనే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందనే విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ఆయా ఎమ్మెల్యేలను నేరుగా ప్రజల వద్దకు పంపడం ద్వారా వారి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టుగా చంద్రబాబు స్కెచ్ వేశారు. ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, పార్టీ నేతలు తమ పనితీరును మెరుగుపరచుకునే అవకాశం కల్పిస్తుంది. అందుకే, నేతలు అమరావతికి రావద్దని, నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజలతో మమేకమవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.
‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం టీడీపీకి రాజకీయంగా మరింత బలం ఇచ్చే అవకాశం ఉంది. ప్రజలతో నేరుగా మమేకం కావడం, కేడర్‌ను యాక్టివ్‌గా ఉంచడం, ప్రభుత్వ విజయాలను హైలైట్ చేయడం ద్వారా పార్టీ బలం పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, కేడర్ ఎంత సమర్థవంతంగా ప్రజలతో కమ్యూనికేట్ చేస్తుంది.. ప్రభుత్వం హామీలను ఎంతవరకు నెరవేరుస్తుంది.. అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. గతంలో వైసీపీ పాలనలో అధికారులపై ఆధారపడటం వల్ల కేడర్ నిర్లక్ష్యానికి గురైందని, అది ఓటమికి దారితీసిందని గుర్తుంచుకోవాలి.