Sajjala Sridhar Reddy: లిక్కర్ స్కాంలో సంచలనం..!! ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి..!?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలున్న మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి (Sajjala Sridhar Reddy) అనే కీలక వ్యక్తిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. ఈ అరెస్టుతో శ్రీధర్ రెడ్డి ఎవరు, ఈ కుంభకోణంలో ఆయన పాత్ర ఏమిటి అనే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
సజ్జల శ్రీధర్ రెడ్డి పులివెందులకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన SPY ఆగ్రో ఇండస్ట్రీస్ అనే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ SPY రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత ఆయన పులివెందుల (Pulivendula) నుంచి నంద్యాలకు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించారు. రాజకీయంగా కూడా శ్రీధర్ రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. 2012లో వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, వైసీపీ అధికారంలోకి రాగానే జనసేనను (Janasena) వీడి వైసీపీలో చేరారు. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణ రెడ్డికి (Sajjala Ramakrishna Reddy) దూరపు బంధువుగా ఉన్న శ్రీధర్ రెడ్డి, తన సామాజిక, రాజకీయ కనెక్షన్లను ఉపయోగించి వైసీపీ (YCP) అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు.
2019-2024 మధ్య వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం సుమారు 3,200 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనింది. SPY ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా మద్యం తయారీ, పంపిణీలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఈ సంస్థ నంద్యాల యూనిట్‌లో జే-బ్రాండెడ్ మద్యం ఉత్పత్తులను తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉత్పత్తులను సిండికేట్ సభ్యులు సేకరించి, శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో పంపిణీ చేసినట్లు సిట్ ఆరోపిస్తోంది. డిస్టిలరీలు, APSBCL, ఎక్సైజ్ శాఖ, వైసీపీ నాయకుల మధ్య శ్రీధర్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తేలింది. మద్యం విధానం రూపొందించడం, బ్రాండ్ ఎంపిక, లంచాల చర్చలు, లాజిస్టిక్స్ లో ఆయన కీలకంగా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సిట్ రిపోర్ట్ ప్రకారం, డిస్టిలరీల నుంచి 20% వరకు కమీషన్‌లు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడం, సరఫరా ఆర్డర్‌లను నిలిపివేసే బెదిరింపులతో లంచాలు సేకరించడం జరిగింది. ఈ లంచాలు హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా లాండరింగ్ చేసినట్లు సిట్ తెలిపింది.
శ్రీధర్ రెడ్డి అరెస్టుకు ముందు, ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajasekhar Reddy) ఆయన తోడల్లుడు చాణక్య (Chanakya) అరెస్టయ్యారు. చాణక్య ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీధర్ రెడ్డి అరెస్టు జరిగినట్లు సమాచారం. ఈ కేసులో శ్రీధర్ రెడ్డిని ఆరో నిందితుడిగా చేర్చారు. మొత్తంగా, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు ఈ మద్యం కుంభకోణంలో కీలక పరిణామంగా నిలిచింది.